17 August, 2026 | 1:46 AM

విద్యతోనే ఉజ్వల భవిష్యత్

17-08-2026 12:00 AM

కలెక్టర్ హరిత

జైనూరు, ఆగస్టు 16(విజయ క్రాంతి): విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ను నిర్మించుకోవచ్చని జిల్లా కలెక్టర్ కె హరిత విద్యార్థులకు సూచించారు. మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) హాస్టల్ను జిల్లా కలెక్టర్  ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లోని తరగతి గదులు, వంటగది, పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.తనిఖీ అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ అల్పాహారం స్వీకరించారు.

ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, పౌష్టికాహారం అందించాలని అధికారులను, హాస్టల్ సిబ్బందిని ఆదేశించారు. ఆహారం విషయంలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.హాస్టల్ ప్రాంగణంతో పాటు వంటగది, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

అనంతరం విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ వారి భవిష్యత్ లక్ష్యాలు, ఉన్నత విద్యపై మార్గదర్శకాలు అందించారు. విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకుని, క్రమశిక్షణతో చదివి వాటిని సాధించాలని సూచించారు. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్పై పలు విలువైన సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఉపాధ్యాయులు, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.