నేత్రదానంతో మరొకరి జీవితంలో వెలుగులు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట్
కామారెడ్డి, ఆగస్టు 25 (విజయక్రాంతి): కంటి దానం మరొకరి జీవితంలో వెలుగులు నింపుతుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట్ అన్నారు. మంగళవారం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ర్యాలీ నిర్వహించారు. కంటి దాన పక్షోత్సవాలు సందర్భంగా కామారెడ్డిలో వైద్యులు, ఎన్జీవోలు కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కంటి దానం అనేది ఒక వ్యక్తి మరణానంతరం కూడా మరొ ఇద్దరి జీవితంలో వెలుగును నింపే గొప్ప మానవతా సేవ అని అన్నారు.
ప్రజలు కంటి దానంపై ఉన్న అపోహలను తొలగించుకొని, కంటి దానం గురించి కుటుంబ సభ్యులతో ముందుగానే చర్చించుకోవాలని సూచించారు. కంటి దానం చేయాలనే సంకల్పం కుటుంబ సభ్యులకు తెలియజేయడం ఎంతో ముఖ్యమని, మరణం సంభవించినప్పుడు వెంటనే సంబంధిత కంటి బ్యాంకు కు సమాచారం అందించాలన్నారు.కంటి దానం అనేది శాస్త్రీయంగా, వైద్యపరమైన నిబంధనలకు అనుగుణంగా నిర్వహించే ప్రక్రియ అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ ఎం ఓ డాక్టర్ రవీందర్ గౌడ్, డాక్టర్ స్వప్న, ఆప్తాలమాలజిస్ట్, డాక్టర్ రాజు ఏవో, డాక్టర్ చందన ప్రియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ మల్లికార్జున్,రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ రాజన్న, లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ప్రదీప్ కుమార్, గంగాధర్,లింబాద్రి హరికిషన్, రవీందర్, రంజిత, మహేందర్ రెడ్డి,వేణుగోపాల్, చెలపతి, విఠల్ రావు , శ్రీనివాస్ రెడ్డి ,శ్యామల,రవి , రమణ,గణేష్ , వర్డ్,సఖి, ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.






