బ్రిటిష్ నాటి చట్టాల్లో మార్పులు చేయాలి
ఫోన్ ట్యాపింగ్ చేసినవారిపై చర్యలు తీసుకోవాలి
పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు
హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): బ్రిటిష్ కాలం నాటి చట్టాల్లో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు పేర్కొన్నారు. నల్సార్ యూనివర్సిటీ వీసీ కొత్తగా మూడు చట్టాలను సూచించారని, వాటిని ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులకు తగిట్టు మార్పులు తీసుకొస్తే దోషులకు త్వరగా శిక్ష పడుతుందని, బాధితులకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
దీంతో తప్పులు చేసేవారికి భయం కలుగుతుందన్నారు. నర్మదా బచావోలో రైతులకు న్యాయం జరడానికి 23 ఏండ్లు పట్టిందని, వారి తరఫున మేఘా పాట్కర్ ఎంతో పోరాటం చేశారని గుర్తుచేశారు. జ్యూడీషియల్ రిమాండ్‌ను 14 రోజుల కంటే పెంచాలని సూచించారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్‌గాంధీ ప్రధాని అయితే ప్రజలకు మేలు జరిగేలా చట్టాల్లో మార్పులు తీసుకొస్తారని అభిప్రాయపడ్డారు.
యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో పేద కుటుంబానికి చెందిన ఆడ పిల్లలను తీసుకెళ్లి అత్యాచారం చేసి, హత్య చేసిన వ్యక్తికి ఇప్పటివరకు శిక్ష పడలేదని, వారి కుటుంబాలకు న్యాయం జరగకపోవడం బాధకరమని ఆవేదన వ్యక్తంచేశారు. గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్నో హత్యలు చేయడమే కాకుండా వందల ఎకరాల భూములను బలవంతంగా లాక్కున్నారని పేర్కొన్నారు. నయీమ్ డైరీ, అతని ఆస్తులు ఎక్కడికి వెళ్లాయనేది తేలాల్సిన అవసరం ఉందన్నారు. లిక్కర్ కేసులో పురోగతి లేదని, ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా దోషులకు వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు.






