ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విచ్చలవిడి ఖర్చు
ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి: రఘునందన్ రావు
హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం బీఆర్‌ఎస్ పార్టీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసిందని... అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను సీఈఓ వికాస్‌రాజ్‌కు అందచేసినట్లు బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తెలిపారు. మంగళవారం నాడు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌కు ఈ మేరకు రాతపూర్వకంగా ఫిర్యాదును అందించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆదాయ పన్ను మినహాయింపు పొందిన ఓ ఖాతా నుంచి రూ. 30 కోట్లు పంపిణీ చేసి ఎన్నికల అక్రమాలకు పాల్పడినందున బీఆర్‌ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఆయన కోరారు.
ప్రజల నుంచి సొమ్ములు వసూలు చేసిన బ్యాంకు ఖాతా, పాన్ నెంబర్ వివరాలు ఈసీకి అందించామన్నారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో చేసిన మంచి పనులు చెప్పుకునేందుకు ఏమీ లేక ఇలా తప్పుడు విధానాలకు పాల్పడుతున్నారని రఘునందన్ ఆరోపించారు. ఎన్నికల్లో గెలవాలంటే కేవలం డబ్బుల పంపిణీ చేస్తే చాలనే తీరుగా ఆ పార్టీ వ్యవహారం ఉందన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకోవడం, ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేయడం, డబ్బులు పంచడం ద్వారా మాత్రమే ఎన్నికలను ఆ పార్టీ ఎన్నికలను ఎదుర్కుందని ఆరోపించారు.
అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను బెదిరించి రాజకీయం చేస్తూ వచ్చిన బీఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవాలనే నీచ స్థాయిలోనే ఉండిపోయిందన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ పాల్పడిన అక్రమాలపై పూర్తి ఆధారాలతో రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని... ఇక్కడ సరైన స్పందన రాకుంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.






