గీతా పఠనంలో ‘ఎలైట్ వరల్డ్ రికార్డ్’ సాధించిన సోదరులు
భిక్కనూర్, ఏప్రిల్ 10(విజయ క్రాంతి): భిక్కనూర్ ఎస్‌ఐ ఆంజనేయులు కుమారులు కుశాల్ మనోహర్ యాదవ్, కార్తీక్ మనోహర్ యాదవ్ ఆధ్యాత్మిక రంగంలో విశేష ప్రతిభ కనబరిచి ‘ఎలైట్ వరల్డ్ రికార్డ్’ సాధించారు. గీతా పరివార్ నిర్వహించిన ఆన్‌లైన్ శిక్షణ ద్వారా గత రెండేళ్లుగా భగవద్గీతలోని 18 అధ్యాయాల 700 శ్లోకాలను అనర్గళంగా కంఠతా నేర్చుకుని గోల్డ్ మెడల్ అందుకున్నారు. “గీతావ్రతి”గా గుర్తింపు పొందారు.
బెంగళూరులో నిర్వహించిన “జ్ఞానస్మృతి” కార్యక్రమంలో పాల్గొని ఎలైట్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్‌ను సొంతం చేసుకున్నారు. గతంలో శృంగేరి శారదా పీఠంలో జరిగిన గీతా జ్ఞాన యజ్ఞంలో పాల్గొని జగద్గురు విధుశేఖర భారతీ స్వామి ఆశీస్సులు పొందారు. అలాగే హర్యానాలోని కురుక్షేత్రలో నిర్వహించిన సహస్ర గీతా పఠన కార్యక్రమంలో పాల్గొని బాబా రాందేవ్, గురు గోవింద్ గిరి చేత ప్రశంసలు అందుకున్నారు.
వారి ప్రతిభను గుర్తించిన జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్, చిన్నారులను పోలీస్ కార్యాలయానికి ఆహ్వానించి అభినందించారు. వారి పఠనాన్ని విని ప్రశంసలు కురిపించారు. చిన్న వయసులోనే ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతున్న ఈ చిన్నారులు జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరసింహ రెడ్డి, ఎస్‌ఐ ఆంజనేయులు పాల్గొన్నారు.




