calender_icon.png 20 February, 2026 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ బంద్ విజయవంతం

20-02-2026 12:00:00 AM

  1. చెన్నూర్ నియోజకవర్గంలో దుకాణాల మూసివేత

మంచిర్యాల జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ

బీఆర్‌ఎస్ నాయకుల ఆందోళనలు.. అరెస్టు 

జైల్‌లో బాల్క సుమన్‌తో హరీశ్‌రావు ములాఖత్

చెన్నూర్/మంచిర్యాల టౌన్/ఆదిలాబాద్, ఫిబ్రవరి 19(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు పలువురు నాయకుల అక్రమ అరెస్టుకు నిరసనగా బీఆర్‌ఎస్ ఇచ్చిన బంద్ నియోజకవర్గంలో విజయవంతమైంది. గురువారం చెన్నూర్ నియోజకవర్గంలోని కోటపల్లి, చెన్నూర్, భీమారం, జైపూర్, మందమర్రి మండలాల్లో వ్యాపార వాణిజ్యవర్గాలు బంద్‌లో పాల్గొన్నాయి.

కోటపల్లి మండలం పారిపెల్లి వద్ద జాతీయ రహదారిపై బీఆర్‌ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించి, నిరసన తెలిపారు. కోటపల్లి మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎరినాగుల ఓదెలు, మండల యూత్ అధ్యక్షుడు మారిశెట్టి విద్యాసాగర్ మాట్లాడుతూ... అక్రమంగా, అన్యాయంగా, అకారణంగా ఉద్యమనాయకున్ని అరెస్ట్ చేసి జైలుకి పంపిన ‘మంత్రి నీకు పాలన చేతకాక ఇలాంటి కుట్రలు చేస్తూ క్షణికానందం పొందుతున్నావు.

క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్మన్‌ను దక్కించుకోవాలని పన్నాగాం పన్ని బాల్క సుమన్‌ను జైలుకి పంపినావు. రాబోయే రోజుల్లో చెన్నూర్ నియోజకవర్గ ప్రజానీకమే బుద్ధిచెపుతోంది’ అని హెచ్చరించారు. అలాగే చెన్నూర్ పట్టణంలో కూడా బంద్ విజయవంతమైంది. చెన్నూరులో బందు నిర్వహిస్తున్న సమయంలో పలువురు బీఆర్‌ఎస్ కార్యకర్తలను, నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

మంచిర్యాల బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అంకం నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పల్లె భూమేష్, మాజీ కౌన్సిలర్ తోట తిరుపతి, మహిళా నాయకురాలు అత్తి సరోజ, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.

పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ : మాజీ మంత్రి హరీశ్‌రావు

రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామాన్ని కాం గ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేసిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధ్వజమెత్తారు. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో ఏర్పడిన గొడవలో అరెస్టై ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మాజీ ఎంపీ బాల్క సుమన్‌ను పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి హరీశ్‌రావు గురువారం జిల్లాకు వచ్చారు.

ఈ సందర్భంగా మావల వద్ద జాతీయ రహదారిపై హరీశ్‌రావుకు మాజీ మంత్రి జోగురామన్న, ఎమ్మెల్యేలు అనిల్‌జాదవ్, కోవలక్ష్మి తదితర జిల్లా నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి జిల్లా జైలు వరకు బీఆర్ ఎస్ శ్రేణులు మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం జిల్లా జైల్‌లో ఉన్న బాల్క సుమన్‌తో హరీశ్‌రావు ములాఖత్ అయ్యారు. హరీశ్‌రావు రాకతో బీఆర్‌ఎస్ శ్రేణులు జిల్లా జైలు వద్దకు తరలొచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ను నిరసిస్తూ జైలు ఎదుట బైఠాయించాయి. అనంతరం మాజీ మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ..

బాల్క సుమన్‌ను సమీపంలో ఉన్న జైల్లో పెట్టడకుండా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్‌కు తరలించాడం దుర్మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంబోపతిరాజు, మాజీ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, జడ్పీ మాజీ చైర్మన్ శ్యామ్ సుందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ ప్రేమేందర్ పాల్గొన్నారు.