calender_icon.png 15 December, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విస్తృతస్థాయి సమావేశం.. హాజరుకానున్న బీఆర్ఎస్ అధినేత

14-12-2025 05:22:24 PM

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో ఈనెల 19వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS chief KCR) అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి మీద చర్చ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి కృష్ణ జలాలను కొల్లగొడుతున్నా కూడా దానిని అడ్డుకునే విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇటువంటి సందర్భంలో.. తెలంగాణ ప్రజల రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని భావించడం జరుగుతున్నది.

ఇందులో భాగంగా.. తదుపరి నిర్మించబోయే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చ జరగనున్నది. ఇటువంటి కీలక సమయంలో పైన తెలిపిన విషయాలతో పాటు, పార్టీ సంస్థాగత నిర్మాణ విషయాలు సహా పలు అంశాలను.. ఈనెల 19న నిర్వహించబోయే విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) అధ్యక్షతన కూలంకషంగా చర్చ జరగనున్నది. అందుకు అనుగుణంగా చేపట్టబోయే ప్రజా ఉద్యమాలను నిర్మాణము, అనుసరించాల్సిన కార్యాచరణపై కీలక నిర్ణయాలు ఉంటాయి. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, జలాల కేటాయింపు, గోదావరి, కృష్ణా జలాల విషయంలో, ఆంధ్ర జల దోపిడిపైన పోరాడేందుకు.. ఒక ఉద్యమ స్వరూపానికి ఈ సమావేశంలో శ్రీకారం చుట్టడం జరగనుంది.