కుమ్మెర మల్లన్న జాతరలో పసి బిడ్డ మృతిపై స్పందించిన కవిత
హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Telangana Jagruti President Kalvakuntla Kavitha) స్పందించారు. కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతో నిరుపేద రజక కుటుంబంపై జరిగిన దాడిలో పసిపాప మరణించడం అమానుషమని, దాడిని తెలంగాణ జాగృతి తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. పాప కుటుంబంతో కవిత ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారంనాగర్ కర్నూల్ ఎస్పీ పాటిల్ సంగ్రామ్ సింగ్ గణపతిరావుతో కవిత ఫోన్ లో మాట్లాడారు. దాడికి కారణమైన నిందితులను తప్పించేందుకు నామమాత్రపు కేసులు పెట్టి రక్షించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కుల వివక్షతో రజక కుటుంబంపై దాడి చేసి పసి బిడ్డ మృతికి కారకులైన వారిపై బీఎన్ఎస్ 106(1), బీఎన్ఎస్ 316(3), జువెనైల్ జస్టిస్ యాక్ట్ 75 ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ ఎస్పీని డిమాండ్ చేశారు.






