10-07-2024 02:14:33 AM
హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఓటమికి తప్పంతా తమదేనని, పార్టీని తిరిగి టీఆర్‌ఎస్‌గా మార్చడం కేసీఆర్ ఇష్టమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి ప్రజలతో మాకు గ్యాప్ రావడమే కారణమన్నారు. తమ వైఖరి మార్చుకోవాల్సిన అవసరం ఉందని, ఓటమికి ప్రజలను తప్పుపట్టడం లేదని, తామే తప్పు చేసినట్టు తెలిపారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో నిర్వహించి న ఇష్టాగోష్టిలో మాట్లాడుతూ.. పార్టీలో తెలంగాణ పేరు మార్చడంతో ఓడిపోయామని అనడానికి ఆధారం లేదన్నారు.
హైదరాబాద్‌లో అన్ని సీట్లు గెలిచామని, చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించ లేకపోయామన్నారు. మాకు అహంకారముందని కృత్రిమ ప్రచారం సృష్టించార ని, వారికి ఆత్మవిశ్వాసం, అహంకారానికి తేడా తెలియదన్నారు. అభివృద్దిలో మాతో పోటీ పడలేనివారే ప్రచారం చేశారన్నారు. పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ప్రవేశపెట్టిన ఏపీలో జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిదన్నారు. అయినా 40 శాతం ఓట్లు సాధించడం మామూలు విషయం కాదన్నారు. పవన్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవన్నారు. ప్రతిరోజు జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఓడిపోయారని సంచులతో దొరికిన వాడు సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. జగన్‌ను ఓడించేందుకు షర్మిలను ఒక పావులా ఉపయోగించారని, అంతకు మించి షర్మిల ప్రభావం చూపలేకపోయిందని పేర్కొన్నారు.
వలసలతో నష్టపోయాం
గతంలో జరిగిన ఫిరాయింపులతో తమకు లాభం జరగలేదని, ఎమ్మెల్యేలను చేర్చుకుని నష్టపోయామని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మా పార్టీలో చేరినవారిలో 10 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారని, ఫిరాయించిన వారి విషయం లో సుప్రీంతీర్పు ప్రకారం మూడునెలల్లో నిర్ణయం తీసుకోవాలన్నారు. రేవంత్‌రెడ్డికి పట్టురాలేదని, పాలన వదిలేసి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అధికారులు మా చేతుల్లో ఉన్నారంటే అది వారి చేతగానితనం అన్నట్లే కదా అని ప్రశ్నించారు. పల్లెల్లో పారిశుద్ధ్యం లోపించడంతో ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.