10-07-2024 01:39:43 AM
మహబూబ్‌నగర్, జూలై 9 (విజయక్రాంతి): భావితరాలకు మంచి భవిష్యత్తును అందించేందుకు ప్రతి ఒక్కరు శ్రమించి అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. నీటిపారుదల ప్రాజెక్టుల పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాలమూరు మినహా పెండింగ్ ప్రాజెక్టులన్నీ ౧౮ నెలల్లో పూర్తికావాలని స్పష్టంచేశారు. అధికారులు విధుల్లో అసలత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. సీఎం రేవంత్ సోమవారం మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలోని అధికారుల సమీకృత కార్యాలయంలో ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు కార్యాలయం ఆవర ణలో వనమహోత్సవంలో భాగంగా మొక్క నాటారు.
ప్రాజెక్టులు త్వరగా పూర్తి కావాల్సిందే
ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆర్డీఎస్ వివాదంపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తో చర్చించాలని సూచించారు. తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్, ఆర్‌డీఎస్, రాజీవ్‌భీమా లిఫ్ట్‌లో భాగంగా ఖానాయ్‌పల్లి ఆర్‌అండ్ అర్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. కోయిల్ సాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచే అం శాన్ని పరిశీలించాలని సూచించారు. కోయిల్‌సాగర్ కింద హాజిలాపూర్, చౌదర్‌పల్లి, నాగిరెడ్డిపల్లి లిఫ్ట్‌లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. ౨౦౨౫, డిసెంబర్ నాటికి కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని సీఎంకు ఇంజినీర్లు హామీ ఇచ్చారు. పక్కన నుంచే పరుగులు పెడుతున్న కృష్ణమ్మ కరువు జిల్లా పాలమూరు కడుపు నింపేలా చర్యలు ఉండాలని సీఎం అన్నారు. పాలమూరు తప్ప మిగిలిన అన్ని ప్రాజెక్టుల పనులు వచ్చే 18 నెల్లో పూర్తయ్యేలా పక్కా ప్రణాళిక వేసుకుని ముందుకు సాగాలని సూచించారు.
ప్రతి గ్రామ పంచాయతీలో బడి
బడి ఈడు పిల్లలంతా పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిందేనని సీఎం స్పష్టంచేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో బడి ఉండాలని అధికారులకు సూచించారు. ప్రతి మండల కేంద్రంలో జూనియర్ కాలేజీ ఏర్పాటుచేసే విషయాన్ని పరిశీలించాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక డిగ్రీ కాలేజీ ఉండాలని అన్నారు. పార్లమెంట్ నియోజకవర్గం యూనిట్‌గా నైపుణ్యాభివృద్ధి కేంద్రం. మెడికల్, ఇంజినీరింగ్ కళాశాల ఉన్నాయో లేవో తెలుసుకొని పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
డీఈవో, డిఫ్యూటీ డీఈవో, ఎంఈవోలు ప్రతి రోజు ఒక పూట పాఠశాలలను తనిఖీ చేసి జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ వారంలో ఒక రోజు పాఠశాల, ఆసుపత్రులను తనిఖీ చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా మొదటి రోజునే వేతనాలు ఇస్తున్నామని, జీతాలు తీసుకొంటున్నందుకు భాద్యతగా పనిచేయాలని కోరారు. తాను కూడా ఆకస్మిక తనిఖీలు చేపడుతాయని తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ పంచాయతీ వరకు ఉద్యోగులకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ పెడుతామని చెప్పారు. సమావేశంలో సీఎం సలహదారు వేం నరేందర్‌రెడ్డి, మంత్రులు దామోదర రాజ నర్సింహ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు