9 May, 2026 | 12:09 PM

గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖలో రూ.కోట్ల అవినీతి

30-08-2024 03:32 PM

హైదరాబాద్: ములుగు జిల్లాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క శుక్రవారం పర్యటిస్తున్నారు. కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం వద్ద దేవాదుల పంపింగ్ స్టేషన్ ను మంత్రులు సందర్శించనున్నారు. ముగ్గురు మంత్రులు ములుగు జిల్లాలోని ప్రాజెక్టు ఇంటెక్‌వెల్‌ వద్ద దేవాదుల ప్రాజెక్టుపై సమగ్ర సమీక్ష నిర్వహించనున్నారు. దేవాదుల ప్రాజెక్టు ఇన్ టేక్ వెల్, పంప్ హౌస్ ల పరిశీలించిన మంత్రులు 2026 మార్చికల్లా దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమర్ రెడ్డి పేర్కొన్నారు.

గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖలో రూ.కోట్ల అవినీతి జరిగిందని మంత్రి ఆరోపించారు. ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం అని, కాళేశ్వర ప్రాజెక్టుని బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని, దేవాదుల ద్వారా 300 రోజులు గోదావరి నీటిని 60 టీఎంసీలు ఎత్తిపోశామని తెలిపారు. నీటిపారుదల శాఖలో ఉన్న పెండింగ్ బిల్లులన్ని చెల్లిస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయని, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్న ప్రాజెక్టును మాత్రం పూర్తిచేస్తామని మంత్రి పొంగులేటీ శ్రీనివాసు రెడ్డి పేర్కొన్నారు.