calender_icon.png 19 December, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలుపు బాటలో బీఆర్‌ఎస్ పూర్వవైభవమే

19-12-2025 01:16:23 AM

  1. ప్రజా బలంతో పంచాయతీ ఎన్నికల్లో తిరుగులేని విజయం 
  2. భవిష్యత్తు గెలుపునకు భువనగిరి నుంచే పునాది 
  3. పాలిచ్చే బర్రెను వదిలి.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్లుంది కాంగ్రెస్ పాలన 
  4. జిల్లా పరిషత్ ఎన్నికలకు సిద్ధం కావాలి 
  5. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ పార్టీకి పూర్వవైభవం ప్రారంభమైందని, భవిష్యత్తులో సాధించబోయే అఖండ విజయాలకు యాదాద్రి భువనగిరి జిల్లా గడ్డ పునాది వేసిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల అభినందనసభలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు.

పెద్దలు చెప్పినట్లు.. ఎక్కడైతే అధికారం పోగొట్టుకున్నా మో, అక్కడే వెతుక్కోవాలని, తాజా సర్పం చ్ ఎన్నికల ఫలితాలు ఆ ఉత్సాహాన్ని ఇస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. రెండేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్ల తేడాతో నిరాశ ఎదురైనా, ప్రస్తుతం భువనగిరిలో 56 మంది, ఆలేరులో 74 మంది, మునుగోడులో 15 మంది, తుంగతుర్తిలో 9 మంది, నకిరేకల్‌లో 7 మంది.. ఇలా జిల్లావ్యాప్తంగా మొత్తం 161 మంది సర్పంచులను గెలిపించుకోవడం సామా న్య విషయం కాదని కొనియాడారు.

ఈ విజయం రాష్ర్టవ్యాప్తంగా పార్టీ శ్రేణులకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని, లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన త ర్వాత రాజకీయం అత్యంత గలీజుగా మారిందని మండిపడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండిం చారు.

నూతనకల్ మండలంలో మల్లయ్య యాదవ్‌ను కిరాతకంగా చంపడం, నల్గొండలో అభ్యర్థిపై దాడి చేసి అమానవీయంగా మూత్రం తాగించి అవమానించడం వంటి ఘటనలు కాంగ్రెస్ నాయకుల వికృత మనస్తత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ ఎప్పుడూ ఇలాంటి చిల్లర రాజకీయాలకు తావివ్వలేదని గుర్తు చేశారు. అధికారులు కూడా అధికార పక్షానికి కొమ్ముకాస్తూ, గెలిచిన బీఆర్‌ఎస్ అభ్యర్థులను దొంగతనంగా ఓడించే ప్రయత్నం చేస్తున్నారని, 150కి పైగా గ్రామాల్లో జరుగుతున్న ఈ అన్యాయంపై కోర్టుల ద్వారా న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.

సిగ్గులేని రాజకీయం..

పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లోకి వెళ్లామని సిగ్గు లేకుం డా మైకుల్లో చెబుతున్న కడియం శ్రీహరి వంటి నాయకులు, అసెంబ్లీలో ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని హీనస్థితిలో ఉన్నారని ఎద్దేవాచేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి 70 ఏళ్ల వయసులో సంపాదించుకున్న గౌరవాన్ని రేవంత్‌రెడ్డి సంకలో చేరి నాశనం చేసుకున్నారని, గబ్బిలాలు సూరు పట్టుకుని వేలాడినట్లు వీరి పరిస్థితి తయారైందని ఘాటుగా విమర్శించారు.

స్పీకర్ కూడా ము ఖ్యమంత్రి చెప్పినట్లు ఆడుతూ, ఫిరాయింపులు కనపడనట్లు నటిస్తున్నారని దుయ్య బట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి మూడు ఫీట్లు ఉన్నా ముప్పు ఫీట్ల డైలాగులు కొడతారని, కానీ క్షేత్రస్థాయిలో ప్రజలు మోసపోయామని గ్రహిస్తున్నారని కేటీఆర్ అన్నారు.

తులం బంగారం ఇస్తామని, పింఛన్లు పెంచుతామని ఉత్త మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు రైతుబంధు రాక రైతులు అల్లాడుతున్నారని పే ర్కొన్నారు. తినే పళ్లెంలో మన్ను పోసుకున్నామని, పాలిచ్చే బర్రెను వదిలి తన్నే దున్న పోతును తెచ్చుకున్నామని ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు.

సర్పంచుల పోరాట స్ఫూర్తి..

సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్‌ఎస్ ప్రతినిధులను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని, దీనికి భయపడాల్సిన పనిలేదని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ‘కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇందిరమ్మ ఇళ్లు ఇయ్యనియ్యం, పింఛ న్లు ఆపుతాం అని బెదిరిస్తున్నారు. ఇవేమీ మీ అత్త సొత్తో, అబ్బ సొత్తో కాదు.. అవి ప్రజల హక్కులు. రాజ్యాంగం ప్రకారం స ర్పంలకు ఉన్న అధికారాల ముందు ఏ ఎమ్మెల్యే ఆటలు సాగవు. నూతనకల్ మం డలం లింగంపల్లిలో మన కార్యకర్త మల్లయ్య యాదవ్‌ను చంపినా, నల్గొండలో యాదగిరిపై అమానవీయంగా దాడి చేసినా మనోళ్లు మొక్కవోని ధైర్యంతో నిలబడ్డారు.

అధికార దుర్వినియోగంతో రీకౌంటింగ్ పేరిట మన గెలుపును దొంగిలించిన 150 గ్రామాల్లో కోర్టుల ద్వారా న్యాయపోరాటం చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, పార్టీ మీకు అండగా ఉంటుంది’ అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, గొంగిడి సునీత, గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, బూడిద బిక్షమయ్య గౌడ్, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.

జిల్లా పరిషత్ ఎన్నికలకు సిద్ధం కావాలి..

వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సత్తా చాటాలని, భువనగిరి కోటపై గులాబీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు ఎవరి అత్త సొమ్ము కాదని, అవి రాజ్యాంగబద్ధంగా ప్రజలకు అందాల్సిన హక్కులని, ఏ ఎమ్మెల్యే వాటిని ఆపలేడని భరోసా ఇచ్చారు. గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ, ముఖ్యం గా ఉమ్మడి నల్గొండ జిల్లా సాధించిన అభివృద్ధిని కేటీఆర్ వివరించారు.

‘ఒక్క మెడికల్ కాలేజీలేని నల్లగొండలో నేడు మూడు మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు వచ్చాయి. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని 1,800 కోట్లతో ప్రపంచస్థాయి అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిదే. మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరోసిస్ పీడను పోగొట్టి ఇంటింటికీ కృష్ణా, గోదావరి జలాలు అం దించాం.

24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు ద్వారా 73 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో వేసిన చరిత్ర మనది. మిషన్ కాకతీయ, డంప్ యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలతో మన పల్లెలను జాతీయ స్థాయిలో 30 శాతం అవార్డులు గెలుచుకునేలా తీర్చిదిద్దిన ఏకైక నాయకుడు కేసీఆర్’ అని గర్వంగా ప్రకటించారు.