6 May, 2026 | 6:22 PM

కొనసాగుతున్న రాస్తారోకో

06-05-2026 05:43 PM

- అటు రాయపట్నంకు - ఇటు శాంతాపూర్ వరకు తట్టిన ట్రాఫిక్

- ప్రత్యామ్నాయంగా ఎల్లంపల్లి మీద నుంచి ప్రయాణం

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని ఊత్కూర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మంచిర్యాల మాజీ ఎంఎల్ఏ దివాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, బాధిత కుటుంబ సభ్యుల ధర్నాతో జాతీయ రహదారికి ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. లక్షెట్టిపేట మండలంలోని గంపలపల్లి, కొత్తూర్ గ్రామాల్లో మంగళవారం రాత్రి షెడ్డు గోడలు కూలడంతో మృతి చెందిన రైతులకు న్యాయం చేయాలంటూ బుధవారం ఉదయం సుమారు 11 గంటల నుంచి ప్రారంభించిన రాస్తారోకో సాయంత్రం ఐదు  గంటల తర్వాత కూడా కొనసాగుతోంది. దాదాపు ఐదున్నర గంటలకుపైగా రాస్తారోకో జరుగుతుండటంతో అటు జగిత్యాల జిల్లా రాయపట్నం దాటి, ఆదిలాబాద్ వైపు దాదాపు ఎల్లారం వరకు, ఇటు మంచిర్యాల వైపు దొనబండ వరకు వాహనాలు ఆగిపోయాయి. మంచిర్యాల నుంచి జగిత్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు కార్లలో, ఆటోలలో హాజీపూర్ మండలం గుడిపేట ఎల్లంపల్లి ప్రాజెక్టు మీదుగా ప్రయాణించారు. తెలంగాణ కోసం ఉద్యమాల సమయంలో జరిగినట్టు ఇంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిది.