20-12-2025 11:29:39 AM
హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. ఏపీ జల దోపిడీ, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై కేసీఆర్ మాట్లాడనున్నారు. తెలంగాణ సాగునీటి హక్కుల రక్షణ కోసం 'మరో ప్రజా ఉద్యమం' పై కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు(Palamuru - Rangareddy Project) 45 టీఎంసీలకే ఒప్పుకోవడంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు బీఆర్ఎస్ 91 టీఎంసీలు కేటాయిస్తే.. నేడు కాంగ్రెస్ కేంద్రం వద్ద మోకరిల్లిందని ఆయన విమర్శించారు. నదుల అనుసంధానం పేరుతో ఏపీ జలదోపిడీకి కేంద్రం సహకరిస్తోందని ఆరోపించారు. సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రకార్యవర్గ సభ్యులు పాల్గొనున్నారు. ఈ కీలక సమావేశానికి అందరూ హాజరుకావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలకు ఆదేశించారు.