20-05-2025 01:03:25 AM
- శ్రీధర్ బాబు ను ఎదుర్కోలేక మహిళా అధికారినిపై అక్కసు
- కాంగ్రెస్ వ్యవహారాల్లో మధునీ జోక్యమెందుకు
- ఐఏఎస్ అధికారినికి పుట్ట క్షమాపణ చెప్పాలి
- మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్, విజయరమణ రావు
పెద్దపల్లి మే19 (విజయ క్రాంతి) దళితులపై వివక్ష చూపింది మీ బీఆర్‌ఎస్ పార్టీ అని, మంత్రి శ్రీదర్ బాబు ను రాజకీయంగా ఎదుర్కోలేక మహిళా అధికారినిపై అక్కసు కక్కుతున్నావని, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో మధు నీ జోక్యమెందుకో చెప్పాలన్నారు.
ఐఏఎస్ అధికారినికి పుట్ట క్షమాపణ చెప్పాలని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్.కే గార్డెన్స్ లో సోమవారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగ వారు మాట్లాడుతూరాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సరస్వతి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తుంటే, ఓర్వలేక మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సంబంధం లేని విషయాల్లో తలదూర్చడం ఎందుకని ప్రశ్నించారు.
పుష్కరాల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో జరుగుతోందని, ప్రోటోకాల్ వ్యవహారం సీఎం, ప్రభుత్వ పెద్దలు చూసుకుంటారని, కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో నీ జోక్యమేందుకని మధును నిలదీశారు. పుష్కరాల ప్రారంభం సమాచారం పెద్దపల్లి ఎంపీకి కూడా అందించారని పేర్కొన్నారు.
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా మంత్రి శ్రీధర్ బాబు సతీమణి ఐఏఎస్ అధికారిని శైలజా రామయ్యర్ నిబంధనల మేరకు సమాచారం ఇచ్చారన్నారు. మంత్రి శ్రీధర్ బాబును ఎదుర్కొనే దమ్ములేక మహిళా అధికారిని పట్ల పుట్ట మధు చేసిన వ్యాఖ్యలు సరికాదని, వెంటనే ఆమెకు మధు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ హయాంలో దళితులను ఎలా ఇబ్బంది పెట్టారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. మా పార్టీ ఎంపీ ప్రోటోకాల్ విషయంలో బీఆర్‌ఎస్ నాయకుడు ఎందుకు జోక్యం చేసుకున్నారని, దీనివెనుక ఉన్న మతలబు ఏమిటన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో మంథని నియోజకవర్గంలో దళితులపై దాడులు, హత్యలు ఇంకా ప్రజలు మర్చిపోలేదని అన్నారు.
రాజకీయాలకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుని రాద్దాంతం చేస్తే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో ఎంపీ ఎన్నికల్లో గడ్డం వంశీ కృష్ణ భారీ మెజారిటీతో గెలుపొందారని గుర్తు చేశారు.
స్థానికంగా జరిగే కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఎలా ఉంటుందో కూడా రాజకీయ అవగాహణ లేకుండా మధు మాట్లాడడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఇంకో సారి తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తలదూరిస్తే చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరించారు. తక్షణమే దేవాదాయ ప్రిన్సిపాల్ సెక్రటరి కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.