ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ విష ప్రచారం
స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ, డిసెంబర్ 8 (విజయక్రాంతి): అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ విష ప్రచారం చేస్తోందని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. ఆదివారం హనుమకొండ జిల్లా మడికొండలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు సభలో ఆయన మాట్లాడారు. అధికారం కోల్పోయిన పిచ్చిలో బీఆర్‌ఎస్, అధికారంలోకి రావాలనే తాపత్రయంతో బీజేపీ దిక్కుమాలిన ఆరోపణలు చేస్తున్నాయన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని, ఒక్క ఖరీఫ్ సీజన్‌లోనే కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించడం రికార్డు అని చెప్పారు. కాళేశ్వరం నీళ్లు లేకుం డా ఈ ఘనత సాధించినట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు 2014కు ముందు ఎన్ని ఆస్తులున్నాయో.. ఇప్పుడెన్ని ఉన్నాయో చెప్పే దమ్ముందా అని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎం పీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






