రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన ర్యాలీ
కుభీర్, ఆగస్టు 21 (విజయక్రాంతి): రైతు బీమా, కళ్యాణలక్ష్మి పథకాలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీఆర్‌ఎస్(BRS protest rally) ఆధ్వర్యంలో కుభీర్ మండల కేంద్రంలో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తహసిల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు టిఆర్ఎస్ కార్యవర్గ సభ్యుడు కిరణ్ కొమ్రేవార్ మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భరోసా , రైతు బీమా, పేద కుటుంబాల ఆడపిల్లల వివాహానికి ఆర్థిక సహాయం పేరుతో ప్రారంభించిన కళ్యాణలక్ష్మి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు.
బిఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. రైతులు, పేద కుటుంబాల ప్రయోజనాలను విస్మరిస్తే ప్రజల తరఫున ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో 100 మీటర్ల బొందలో పాతి పెడతారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్, మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్, మండల అధ్యక్షుడు ఎన్నిల అనిల్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గులాబీ కండువాలు ధరించి, పార్టీ జెండాలు, ప్లకార్డులతో ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.






