21 August, 2026 | 7:03 PM

సింగరేణి హెల్త్ కార్డుల్లో వ్యత్యాసాలు సరికాదు

21-08-2026 04:17 PM

విప్లవ కార్మిక సంఘాల డిమాండ్

బెల్లంపల్లి, (విజయ క్రాంతి): సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో జారీ చేసిన హెల్త్ కార్డు విధానంలో వివక్షత ఉందని టిఎన్టియుసి రాష్ట్ర కార్యదర్శి మని రామ్ సింగ్, ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర పోచ మల్లు. ఎస్ జి కే ఎస్ నాయకులు మహేందర్ ఆరోపించారు. ఈ మేరకు ఓ ప్రకటనలో సింగరేణి విధానాన్ని తీవ్రంగా ఖండించారు.  హెల్త్ కార్డు వినియోగంలో కొందరికి పూర్తి స్థాయి వైద్య సేవలు అందుతుండగా, మరికొందరికి చికిత్సలు, ఆసుపత్రుల ఎంపిక, నగదు రహిత వైద్యం వంటి అంశాల్లో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయనీ విమర్శించారు.

ఒకే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు హెల్త్ కార్డు సేవల్లో ఎందుకు ఈ తేడాలు వస్తున్నాయో సింగరేణి యాజమాన్యం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందనీ డిమాండ్ చేశారు. కార్డు ఉన్న ప్రతి అర్హుడైన ఉద్యోగి, పెన్షనర్, కుటుంబ సభ్యుడికి సమానమైన వైద్య సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని  కోరారు. ఆరోగ్య సేవల్లో అందరికీ సమాన హక్కు ఉండాలనీ... సింగరేణి హెల్త్ కార్డుల విషయంలో వ్యత్యాసాలకు స్వస్తి పలకాలన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం, సంబంధిత అధికారులు చొరవ తీసుకొని సమస్య పరిష్కారం చేయాలన్నారు. లేనిపక్షంలో జరగబోయే ఆందోళన కార్యక్రమాలకు సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు.