నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్ నిరసనలు
- మోటార్ సైకిల్ ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోలు, నల్లజెండాలతో ప్రదర్శనలు
- కేసీఆర్‌ను సిట్ పేరిట ప్రభుత్వం వేధిస్తోందన్న బీఆర్‌ఎస్ నేతలు
- విచారణకు సహకరిస్తామని చెప్పినా కక్షసాధింపులా? అని మండిపాటు
- కాంగ్రెస్ దుర్మార్గపు వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్న నేతలు
- సర్కార్‌కు నిరసన సెగ తాకాలన్న బీఆర్‌ఎస్ సీనియర్ నేతలు
హైదరాబాద్, జనవరి 31: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ వేధింపులను నిరసిస్తూ ఆ పార్టీ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్ విచారణకు సహకరిస్తానని ప్రకటించినా పాలకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తింది. కాంగ్రెస్ దుర్మార్గపు వైఖరిని ప్రజలకు వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మోటార్ సైకిల్ ర్యాలీ లు, ధర్నాలు, రాస్తారోలు, నల్లజెండాలతో ప్రదర్శనలు చేపట్టాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు.
ఈ మేరకు శనివారం బీఆర్‌ఎస్ సీనియర్ ముఖ్య నేతలు మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావుగౌడ్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, బాలమల్లు, కర్నె ప్రభాకర్, ఎం ఎల్ ఏ వివేక్, కృష్ణారావు తదితరులు మీడియా సమావేశంలో మాట్లాడారు. మా జీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్‌కు పూర్తిగా సహరిస్తానని ప్రకటించినా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
ఒక మాజీ సీఎం అని కూడా చూడకుండా ఆయన గౌరవానికి భంగం కలిగేలా సిట్ అధికారులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. పైశాచికంగా వ్యవహరిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్‌ను వేధిస్తోందని, రాజకీయ వేధింపుల్లో భాగంగా ఆయనను అవమానిస్తూ అమానుషంగా ప్రవర్తిస్తోందని మండి పడ్డారు. ఫోన్ ట్యాపింగ్ పేరిట కట్టుకథలు సృష్టించి, ఇప్పుడు సిట్ విచారణ పేరుతో నోటీసులు జారీ చేయడం దుర్మార్గం, నీచమైన చర్య అని నేతలు ధ్వజమెత్తారు.
ప్రజాస్వామ్య యుతంగా నిరసనలు
కేసీఆర్‌పై కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తూ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు చేపట్టాలని నేతలు పిలుపునిచ్చారు. నాయకులు, పార్టీ శేణులు తమ సొంత జిల్లాల్లోనే దిష్టిబొమ్మల దహనాలు, ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలతో ప్రభుత్వానికి నిరసన సెగ చూపించాలని కోరారు. పోలీసులతో ఘర్షణలకు తావివ్వకుండా ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలకు వివరించాలని కోరారు.
ఆయా సమావేశాల్లో బీఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, బొమ్మెర రామమూర్తి, కడారి స్వామి యాదవ్ కార్పొరేటర్లు జగన్, సురేష్ రెడ్డి, సత్యనారాయణ, నాగరాజు యాదవ్, దేవర మల్లప్ప, సుమిత్రానంద, మన్నె గోవర్ధన్‌రెడ్డి, అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, ప్రేమ్ కుమార్ దూత్, కొమ్ము నరేందర్ తదితరులు పాల్గొన్నారు
తెలంగాణను అవమానించినట్టే..
తెలంగాణ ఉద్యమ సారథిగా, సాధకుడుగా, రెండు విడతల ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపించిన కేసీఆర్‌ను కేసులు, నోటీసుల పేరిట వేధింపులకు, కక్ష సాధింపులకు గురిచేయడం సరి కాదన్నారు. ఆయన్ను అవమానించటం అంటే తెలంగాణ నేలను అవమానించటమే అవుతందున్నారు.
మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా విచారణ ప్రక్రియ వారం రోజులు వాయిదా వేయాలని కోరినప్పటికీ ప్రభుత్వం నిరాకరించడం వెనుక రాజకీయ కక్ష సాధింపు మాత్రమే ఉందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా తెలంగాణ ప్రజల సమస్యలపై, ఇచ్చిన హామీలపై, అవినీతి ఆరోపణలపై బీఆర్‌ఎస్ పోరా టం మరింత తీవ్రతరం చేస్తుందని నేతలు స్పష్టం చేశారు.




