ధాన్యం కొనుగోలు జాప్యంపై బీఆర్‌ఎస్ ఆందోళన
అశ్వాపురం, ఫిబ్రవరి 28, (విజయక్రాంతి): ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లిప్త వైఖరిని నిరసిస్తూ అశ్వాపురం మండల బీఆర్‌ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. స్థానిక మండల పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని ఆరోపించారు. ప్రజా పాలన పేరుతో దగా పాలన కొనసాగుతోందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం తీసుకువచ్చి నెలరోజులు అవుతున్నా సరైన కార్యాచరణ ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
డిక్లరేషన్ల పేరుతో ప్రభుత్వం రైతులను మభ్యపెట్టిందని, వాస్తవంగా రైతులకు ఎటువంటి మేలు జరగలేదన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ రైతు సమస్యలపై సమీక్షలు జరపకపోవడం బాధాకరమని, ధాన్యం కొనుగోలు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. యాసంగి రైతుబంధు కింద ఎకరానికి ఒకసారి చెల్లింపులు చేస్తూ ఇప్పటివరకు రెండు ఎకరాల వరకు మాత్రమే ఇచ్చారని, మూడో ఎకరానికి ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టత లేదన్నారు. ఖరీఫ్ రైతుబంధు సమయం దగ్గర పడుతున్నా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. తక్షణమే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని, లేనిపక్షంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోడి అమరేందర్, మర్రి మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, కందుల కృష్ణార్జున రావు, కంచుగట్ల వీరభద్రం, గద్దల రామకృష్ణ, భూక్య చందూలాల్ తదితరులు పాల్గొన్నారు.






