29 April, 2026 | 2:00 AM

మినీ ట్యాంక్ బండ్ చిరకాల స్వప్నం నెరవేరేనా..?

29-04-2026 12:42 AM

పెంట్లవెల్లి, ఏప్రిల్ 28: పెంట్లవెల్లి మండల కేంద్రం నిర్మాణంలో ఉన్న మినీ ట్యాంక్ బండ్ పనులు రెండున్నర ఏళ్ళుగా నిలిచిపోవడంతో స్థానిక ప్రజల ఆశలు నెరవేరకుండానే మిగిలిపోతున్నాయి. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రూ.4 కోట్లకు పైగా నిధులతో 2022లో ఈ పనులు ప్రారంభమయ్యాయి.

అయితే నిధుల కొరత కారణంగా బ్రిడ్జి, మినీ ట్యాంక్ బండ్ పనులు మధ్యలోనే ఆగిపోయి ఇప్పటికీ పునఃప్రారంభం కాలేదు.ఈ మార్గంలో కొల్లాపూర్‌పెబ్బేరు మధ్య ప్రతిరోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. బ్రిడ్జి, మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం పూర్తయితే పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం లభించి, దశాబ్దాలుగా ఉన్న సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.

పెంట్లవెల్లి అలుగు వద్ద పిల్లర్ల నిర్మాణం పూర్తయినా, మిగతా పనులు మాత్రం నిలిచిపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి వర్షాకాలం రాకముందే పనులు ప్రారంభించాలని, తాత్కాలికంగా రహదారిలో ఉన్న గుంతలను పూడ్చి ప్రజలకు సురక్షిత రవాణా సౌకర్యం కల్పించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.