18 August, 2026 | 1:17 AM

కళ్యాణ, షాదీముబారక్ పునరుద్ధరణ కోరుతూ బీఆర్‌ఎస్ ధర్నా

18-08-2026 12:01 AM

బెజ్జూర్ ఆగస్టు 17 (విజయ క్రాంతి ): పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి - షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తహసిల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థత వల్లే హైకోర్టు ఈ పథకాలపై స్టే విధించిందని ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల, పేదల ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలిచిన ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు.‘భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ఈ పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలి.

లేకుంటే భవిష్యత్తులో మరింత భారీ ఎత్తున ఉద్యమిస్తాం. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీదే‘ అని నిరసనలో పాల్గొన్న నాయకులు హెచ్చరించారు.పథకం రద్దుతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయపోరాటం చేసి పథకాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.ఈ ధర్నాలో బీఆర్‌ఎస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.