04-02-2026 12:00:00 AM
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
సూర్యాపేట, ఫిబ్రవరి 03 (విజయక్రాంతి): సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ గెలుపు గుర్రాలకే టికెట్లను కేటాయించినట్లు మాట్లాడిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అన్ని వార్డుల నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికను పూర్తిచేసిన అనంతరం మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీట్ల ఎంపికలో అందరికీ సమన్యాయం జరిగేలా చేశామన్నారు.
అందుకు సహకరించిన మాజీ మున్సిపల్ చైర్మన్లకు సీనియర్లకు, ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు తగిన బుద్ది చెప్పేందుకు పట్టణ ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. తమ హయాంలో మహానగరాలకు దీటుగా సూర్యాపేటను తీర్చిదిద్దామన్నారు. పరిశుభ్రంగా ఉన్న పట్టణాన్ని రెండేళ్లలో ఆగం చేశారన్నారు. ఇచ్చిన మాట ప్రకారమే సూర్యాపేటను జిల్లాగా మార్చుకున్నామని, మెడికల్ కాలేజ్, కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, మహాప్రస్థానం ఇలా అనేక అభివృద్ధి ఫలాలు పొందగలిగామన్నారు. రోడ్లు, సెంట్రల్ లైటింగ్, ట్యాంక్ బండ్, బోటింగ్, పార్కులతో ఆహ్లాదాన్ని పెంచిన ఘనత బీఆర్‌ఎస్ కే దక్కుతుందన్నారు.
కారు గుర్తు బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిస్తేనే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వచ్చిన నిధులను వాపస్ పంపిన దుర్మార్గపు చరిత్ర కాంగ్రెస్ పార్టీది అన్నారు. సూర్యాపేటలో ఆ ఇద్దరోక్కటై వార్డులు పంచుకున్నది.. దోచుకునేందుకే అన్నారు. ఈ ఎన్నికలలో అభివృద్ధి బీఆర్‌ఎస్ కు పట్టం కట్టి అరాచక కాంగ్రేస్ కు బుద్దిచెప్పాలన్నారు. 48 వార్డుల్లో పార్టీ అభ్యర్థులు బలంగా ఉన్నారని భారీ మెజార్టీతో విజయం సాధిస్తామన్నారు. సిపిఎం, సిపిఐలు బీఆర్‌ఎస్ కు సహకరిస్తునందుకు ధన్యవాధాలు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.