23 July, 2026 | 9:23 AM

కరస్‌గుత్తి గిరిజన గురుకులంలో విద్యార్థిని అదృశ్యం

23-07-2026 08:53 AM

ఉదయం నుంచి కనిపించని ఎంపీసీ విద్యార్థిని.. సాయంత్రం తల్లిదండ్రులకు సమాచారం.. రాత్రి పోలీసులకు ప్రిన్సిపాల్ ఫిర్యాదు

నాగల్‌గిద్ద, జూలై 22 (విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండలంలోని కరస్‌గుత్తి గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం(MPC First Year) చదువుతున్న విద్యార్థిని రాథోడ్ పూజ అనుమానాస్పద పరిస్థితుల్లో అదృశ్యమవడం కలకలం రేపింది. విద్యార్థిని ఉదయం నుంచి కనిపించకపోవడంతో పాఠశాల యాజమాన్యం గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ లభించకపోవడంతో చివరకు నాగల్‌గిద్ద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పాఠశాల ప్రిన్సిపాల్ (ఎఫ్‌ఏసీ) జె. ఇంద్రజ పోలీసులకు సమర్పించిన ఫిర్యాదు ప్రకారం, రాథోడ్ పూజ తండ్రి రాములు, కల్హేర్ మండలం ఆలీఖాన్‌పల్లి గ్రామానికి చెందిన విద్యార్థిని. ఆమె ఈ నెల జూలై 10న కరస్‌గుత్తి గిరిజన గురుకుల జూనియర్ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువులో చేరింది.

బుధవారం ఉదయం సుమారు 11:25 గంటల నుంచి 11:30 గంటల మధ్య ఎలాంటి అనుమతి తీసుకోకుండా లేదా ఎవరికీ సమాచారం ఇవ్వకుండా కళాశాల నుంచి వెళ్లిపోయినట్లు యాజమాన్యం గుర్తించింది. అనంతరం ఉపాధ్యాయులు, సిబ్బంది కళాశాల ఆవరణతో పాటు సమీప ప్రాంతాల్లో గాలించినప్పటికీ విద్యార్థిని ఆచూకీ లభించలేదు. విద్యార్థిని కనిపించకపోవడంతో సాయంత్రం 3 గంటల సమయంలో పాఠశాల యాజమాన్యం ఆమె తండ్రికి ఫోన్ ద్వారా సమాచారం అందించింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే కరస్‌గుత్తి గురుకులానికి చేరుకుని ప్రిన్సిపాల్ ఇంద్రజను కలిసి తమ కుమార్తె గురించి ఆరా తీశారు. ఉదయం నుంచే విద్యార్థిని కనిపించకపోయినా తమకు ఆలస్యంగా సమాచారం ఇవ్వడంపై వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో విద్యార్థిని గుర్తింపు వివరాలను కూడా ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. పూజ ఎత్తు సుమారు 4.95 అడుగులు, మధ్యస్థ గోధుమ రంగు చర్మం కలిగి ఉందని, అదృశ్యమైన సమయంలో లైట్ గ్రీన్ రంగు పంజాబీ డ్రెస్ ధరించి ఉన్నట్లు తెలిపారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా వెతికినా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో పోలీసుల సహాయం కోరినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాత్రి సుమారు 9:30 గంటలకు నాగల్‌గిద్ద పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ రామకృష్ణకు ప్రిన్సిపాల్ జె. ఇంద్రజ లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. విద్యార్థిని ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టి గుర్తించి అప్పగించాలని పోలీసులను కోరారు. ఫిర్యాదు స్వీకరించిన నాగల్‌గిద్ద పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థిని ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. విద్యార్థిని ఆచూకీపై ఇంకా స్పష్టమైన సమాచారం అందాల్సి ఉంది.