మధిరలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలి
టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు
మధిర, మంథని, జూలై 23 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను ప్రతి గ్రామం, పోలింగ్ బూత్ స్థాయిలో వేగవంతంగా మరియు సమర్థవంతంగా పూర్తి చేయాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పిలుపునిచ్చారు. మధిర పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏ సూపర్వైజర్ల సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అర్హత కలిగిన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, బీఎల్‌ఏ సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. జాబితా సవరణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిశితంగా పరిశీలించాలని, అర్హులైన యువత ఓటు హక్కు పొందేలా ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గం మోడల్‌గా నిలవాలని, ఇందుకోసం ఎస్‌ఐఆర్ ప్రక్రియను అత్యంత విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ బీఎల్‌ఏ సూపర్వైజర్లు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






