23 July, 2026 | 9:33 AM

విద్యార్థులపై హింసకు కంటతడి పెట్టిన ఎమ్మెల్యే రాగమయి

23-07-2026 08:59 AM

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది 

భారీ నిరసన ర్యాలీ తరలివచ్చిన వేలమంది విద్యార్థులు 

సత్తుపల్లి జూలై23(విజయక్రాంతి): ఏఐసీసీ,టీపీసీసీ పిలుపుమేరకు సత్తుపల్లి నియోజకవర్గంలో శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని జె.వి.ఆర్ డిగ్రీ కళాశాల నుండి ప్రారంభమైన నిరసన ర్యాలీలో వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందరూ కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజ్ పై విద్యార్థులు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే,కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను 22 మందిని బలి చేశారని,రక్తం పారే విధంగా కొడుతూ,కాళ్లు చేతులు తొక్కుతూ, విరగొడుతూ అలాంటి హృదయ వికార దృశ్యాలను చూసి ఆమె కంటతడి పెట్టుకుంది.

శాంతియుతంగా వాళ్ల పోరాటాలు సాగిస్తుంటే విచక్షణ రహితంగా వాళ్ళను చిత్రహింసలు పెట్టడం పద్ధతి కాదని, అప్రజాసౌమ్య చర్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు ప్రజల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు. విద్య ఉపాధి యువత భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని,ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే చర్యలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడే సమయం దగ్గర పడిందని, విద్యార్థులు ఆధైర్య పడవద్దని, అండగా మేము ఉన్నామని ధైర్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రెహానా కమల్, వైస్ చైర్పర్సన్ బొంతు సుమలత, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, గాదె చెన్నారావు,గొర్లమారి రామ్మోహన్ రెడ్డి, తోట సుజలా రాణి, బుక్కా కృష్ణవేణి, నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు,కాంగ్రెస్ నాయకులు,విద్యార్థులు విరివిగా పాల్గొన్నారు.