23 July, 2026 | 9:37 AM

విద్యా సంస్థల బంద్ పిలుపుకు ఆర్సీఎస్ సంపూర్ణ మద్దత్తు

23-07-2026 09:05 AM

మోకాళ్ళ సమ్మయ్య 

గుండాల, (విజయక్రాంతి): నీట్ పేపర్ లీకేజికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధన్  రాజీనామా(Union Minister Dharmendra Pradhan resigns) చేయాలని రైతు కూలీ సంఘం(ఆర్సీఎస్) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు మోకాళ్ళ సమ్మయ్య ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రేపు విద్యార్థి సంఘాలు తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ కు సంపూర్ణ మద్దత్తు ప్రకటిస్తున్నట్టు ఆయన తెలిపారు. విద్యా వ్యవస్థలోని లోపాలను, కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ విద్యార్థిని, విద్యార్థులపై జూలై 21 న న్యూఢిల్లీలో జరిగిన లాఠీ ఛార్జ్ లో పోలీస్ ముసుగులో ఆర్ఎస్ఎస్, బీజేపీ గూండాలు చేసిన దాడిని రైతు కూలీ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటి తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

దేశంలో మోధీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను యావత్ భారత ప్రజానీకం ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. స్వేచ్ఛ వాణిజ్యం పేరా అమెరికా, ఇంగ్లాండ్, దేశాలతో చేసుకునే ఒప్పందాల వల్ల భారత వ్యవసాయ రంగం కుదేలు అవుతుందని, రైతు రోడ్డున పడతాడని అన్నారు. గ్రామీణ ప్రజలకు జీవనోపాధి ఇచ్చే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు వీబీజీ రామ్ జీ గా పేరు మార్చి ఉపాధి హామీకి మంగళం పాడే కుట్రలు చేస్తున్నారని, మరోపక్క కార్మిక చట్టాలను కుదించి 4 కోడ్ లుగా చేసి కార్మిక హక్కులన్నింటిని కాలరాస్తున్నారని మండిపడ్డారు.

ఇరాన్ పై ఇజ్రాయిల్, అమెరికా మద్దతుతో చేస్తున్న యుద్దాన్ని సమర్దించి భారత ఆర్ధిక వ్యవస్థ చిన్నభిన్నం చేస్తున్నారని, యుద్ధ ప్రభావం వల్ల మధ్య తరగతి ప్రజలు ఆర్ధిక ఇబ్బందుల్లో విలవిలాడుతున్నారని ఆయన వాపోయారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూసివేతకు గురైనాయని, కేవలం ఈ దేశంలోని కొంత మంది సంపన్నుల కోసం మోధీ సర్కార్ పాలన సాగిస్తుందన్నారు. మోధీ కనుసన్నల్లోనే నీట్ పేపర్ లీకేజి జరిగిందని ఆరోపించారు. నీట్ లీకేజి వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ నాశనం అయ్యిందని, కేంద్రం అవినీతిని ప్రశ్నిస్తు విద్యావేత్త, శాస్త్రవేత్త సోనో వాంగ్ చుక్ చేస్తున్న ఆందోళనను సైతం నిర్లక్ష్యం చేయడం సిగ్గుచేటని అన్నారు.

విద్యార్థులు ప్రధాని మోడీ, ధర్మేంద్ర ప్రధాన్ అవినీతి చర్యలకు నిరసన తెలిపితే రక్తాలు చిందేలా మహిళ విద్యార్థులను సైతం వేటాడి తరిమి తరిమి గాయపర్చడం భారత ప్రజాస్వామ్యనికి మచ్చ గా మేము తెలియజేస్తున్నామన్నారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించి, నష్టపరిహారం చెల్లించాలని, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, జూలై 24 న విద్యా సంస్థల బంద్ కు ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, కార్మికులు సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తూ ఊరేగింపులు జరుపాలని ఆయన పిలుపునిచ్చారు.