వర్షాలపైనా రాజకీయాలా?
ధాన్యం కొనుగోళ్లపై విపక్షాలది దుష్ప్రచారం
బీజేపీ చేస్తున్నది ‘రైతు గోస’ యాత్ర కాదు.. అధికారం కోసం ‘రాజకీయ ఘోష’
బీఆర్‌ఎస్‌వి డైవర్షన్ పాలిటిక్స్
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): ప్రతిపక్షాలు అకాల వర్షాలనూ రాజకీయాల కోసం వాడుకుంటున్నాయని, ధాన్యం కొనుగోళ్లపై దుష్ప్రచారం చేయడం తగదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. బీజేపీ కేంద్రంలో 12 ఏళ్లు అధికారంలో రైతులకు ఏం చేసిందని? ప్రశ్నించారు.
రైతుల ఆదాయం రెట్టింపు చేయకపోగా ఎరువుల ధరలు పెంచి, నల్ల చట్టాలతో తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. తెలంగాణలో ‘రైతు గోసగి భరోసా’ పేరిట ఆ పార్టీ రాజకీయ యాత్ర చేస్తోందని ఎద్దేవా చేశారు. అది ‘రైతు గోస’ కాదని అధికారం కోసం బీజేపీ నాయకులు పడుతున్న ‘రాజకీయ ఘోష’ అని మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా అన్నదాతలకు అన్యాయం చేస్తుందెవరో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నాడు తెలంగాణలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని అడగటానికి వెళ్తే మీ వాళ్లకు నూకలు తినటం అలవాటని అవమానించిన మీ కేంద్ర మంత్రుల చరిత్రను మర్చిపోయారా? అని మంత్రి ప్రశ్నించారు. బీజేపీ నాయకులు రైతుల పక్షాన నిలబడకుండా మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రైతు సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ రైతులకు రావాల్సిన హక్కులు, నిధులను సాధించాలని సూచించారు.
ఉనికి కోసం బీఆర్‌ఎస్ ఆరాటం
ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులకు ధైర్యం చెప్పి, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బీఆర్‌ఎస్.. వాటిని పక్కనబెట్టి, రాజకీయ ఉనికి కోసం ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటని మంత్రి విమర్శించారు. ప్రభుత్వం పారదర్శకంగా, రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరుపుతుంటే ప్రజలను తప్పుదోవ పట్టించేలా డైవర్షన్ పాలిట్రిక్స్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని కుట్రలు చేసినా చివరి గింజ కొనే వరకు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందనిఇ స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకుల దుష్ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.






