నారాయణఖేడ్‌లో దారుణ హత్య
నారాయణఖేడ్, మార్చి 23: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలో గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యం రెడ్డి మిస్సింగ్ కేసు సంచలంగా మారింది. గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యంరెడ్డిని అతని భార్య కల్పన, ప్రియుడు పండరితో కలిసి హత్య చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత తొమ్మిది రోజులుగా ముత్యంరెడ్డి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నారాయణఖేడ్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భార్య కల్పనపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు, ఆమెతో పాటు ప్రియుడు పండరిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు సమాచారం. కల్పన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుండగా, మానూరు మండలం ఎల్గోయి గ్రామానికి చెందిన గైనీ పండరితో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిసింది. దీంతో అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా మారుతున్నాడనే కారణంతోనే ముత్యంరెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన నారాయణఖేడ్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
ఈ సందర్భంగా నారాయణఖేడ్ డి.ఎస్.పి వెంకట్ రెడ్డి సంఘటనకు సంబంధించి పలు వివరాలు వెల్లడించారు. గంగాపూర్ గ్రామానికి చెందిన ముత్యం రెడ్డి గత తొమ్మిది రోజుల క్రితం మిస్సింగ్ అవడంతో నారాయణఖేడ్ పోలీసులు సిఐఎస్‌ఐ ఆధ్వర్యంలో విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. మృతుని భార్య అక్రమ సంబంధమే భర్త హత్యకు కారణమైనట్లు ఆయన తెలిపారు. మృతుడు ముత్యం రెడ్డిని మానూరు మండలం శివారులో హత్య చేసి ఎవరికి అనుమానం రాకుండా జెసిబి తో గొయ్యి తీసి పాతిపెట్టాడని తెలిపారు. హత్యకు సంబంధించిన వివరాలు పోస్టుమార్టం అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.






