calender_icon.png 19 August, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూకట్‌పల్లిలో బాలిక దారుణ హత్య

19-08-2025 01:41:36 AM

  1. కడుపు, ఛాతి భాగంలో కత్తిపోట్లు 
  2. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై గుర్తు తెలియని వ్యక్తి దాడి!

కూకట్‌పల్లి, ఆగస్టు 18 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లిలో సోమవారం బాలిక దారుణ హత్యకు గురైంది. బాలానగర్ డీసీపీ సురేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా ముక్తక్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ దంపతులు కూకట్‌పల్లి సంగీత నగర్‌లో నివాసం ఉంటున్నారు. కృష్ణ బైక్ మెకానిక్‌గా పని చేస్తుండగా, రేణుక ఓ ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నది. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు.

కూతురు సహస్ర (12) కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆరో తరగతి చదువుతున్నది. సోమవారం ఉద యం తల్లిదండ్రులు వారి పనులకు వెళ్లగా.. పాఠశాలకు సెలవు ఉండటంతో సహస్ర ఇంటి వద్దే ఉన్నది. మధ్యాహ్నం తన కుమారుడుకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి ఇంటికి వచ్చిన కృష్ణకు కూతురు సహస్ర మంచంపై రక్తపు మడుగులో పడి విగత జీవిగా కనిపించింది.

డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలిక మృతదేహాన్ని పరిశీలించారు. బాలిక కడుపు, ఛాతి భాగంలో కత్తి పోట్లు ఉన్నట్లు గుర్తించారు. సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని గమనించిన గుర్తుతెలియని వ్యక్తి కత్తితో హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.