11 August, 2026 | 2:00 AM

రంగారెడ్డి జిల్లాలో 12.88 లక్షల ఓట్లకు ఎసరు!

11-08-2026 12:47 AM
  1. సర్ లో నమోదైంది 65.16 శాతమే..
  2. ఫారాలు నింపని 34.78 శాతం ఓటర్లు
  3. కల్వకుర్తి 88.39 శాతంతో అగ్రస్థానం.. ఎల్బీనగర్ 55.52 శాతంతో లాస్ట్ 
  4. జిల్లా వ్యాప్తంగా 5.59 లక్షల అనుమానాస్పద ఓట్లు గుర్తింపు

రంగారెడ్డి, అగస్టు 10(విజయక్రాంతి): ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ  సర్ ప్రక్రియతో రంగారెడ్డి జిల్లాలో భారీగా ఓట్లు మాయం కానున్నాయి. క్షేత్రస్థాయిలో బిఎల్‌ఓలు పంపిణీ చేసిన ఎన్యుమరేషన్ ఫారాలను దాదాపు 34.78 శాతం మంది ఓటర్లు తిరిగి అందజేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది. సకాలంలో ఫారాలు సమర్పించని  12.88 లక్షల ఓటర్లను ఓటరు జాబితా నుంచి తొలగించేందుకు అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. 

జిల్లా లో మొత్తం ఓటర్లు: 36,99,743

డిజిటైజ్ అయినవి: 24,10,850 (65.16%)  

వెరిఫికేషన్ పూర్తయినవి: 24,09,640 (65.13%)  

తిరిగి రాని ఫారాలు (డిలీషన్ పరిధిలో): 12,88,893 (34.78%)  

తేడాలున్న ఓట్లు: 5,59,923 (15.13%)

జిల్లాలోని నియోజకవర్గాల నమోదు శాతాన్ని పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాలు మెరుగైన ప్రదర్శన కనబరచగా, నగర శివార్లలోని నియోజకవర్గాలు వెనుకబడ్డాయి. కల్వకుర్తి (88.39%), షాద్నగర్ (85.55%) ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలవగా.. ఐటీ, అర్బన్ పరిధి ఎక్కువగా ఉండే ఎల్బీనగర్ (55.52%), శేరిలింగంపల్లి (57.26%), మహేశ్వరం (58.98%) నియోజకవర్గాల్లో ఓటర్ల స్పందన ఆశించిన స్థాయిలో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

కలవరపెడుతున్న 5.59 లక్షల ఓట్లు..

జిల్లాలో పరిశీలన పూర్తయిన ఓటర్లలో ఏకంగా 5,59,923 (15.13%) ఓట్లను అనుమానస్పద ఓట్ల గా అధికారులు గుర్తించారు. అత్యధికంగా రాజేంద్రనగర్లో 96,827, మహేశ్వరంలో 84,276, శేరిలింగంపల్లిలో 70,768 అనుమానస్పద కేసులు నమోదయ్యాయి.

నియోజకవర్గాలుగా సర్ పరిస్థితి...

ఇబ్రహీంపట్నం 75.20   

ఎల్బీనగర్ 55.52  

మహేశ్వరం         58.98   

రాజేంద్రనగర్         61.08   

శేరిలింగంపల్లి         57.26   

చేవెళ్ల         79.70  

కల్వకుర్తి         88.39

షాద్నగర్         85.55  

మొత్తం         65.16