25-08-2025 01:47:33 AM
కిరాతకంగా భార్యను హతమార్చిన భర్త
మేడిపల్లి, ఆగస్టు 24: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పీఎస్ పరిధిలోని బోడుప్పల్‌లో ఆదివారం దారుణం వెలుగు చూసింది. భార్యను చంపి, మృతదేహాన్ని రంపంతో ముక్కలు చేసి మూసీలో పడేసి భర్త మిస్సింగ్ నాటకమాడాడు. మల్కాజిగిరి డీసీపీ పద్మజ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి అలియాస్ జ్యోతి(21), సామల మహేందర్‌రెడ్డి (28) ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఇంటర్ చదివిన మహేందర్‌రెడ్డి ర్యాపిడో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. స్వాతి కాల్ సెంటర్‌లో జాబ్ చేస్తోంది. పెళ్లయిన రెండు నెలల నుంచే వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. కొన్ని రోజులు కామారెడ్డిగూడ లోనే ఉన్నారు. అక్కడ కేసు కూడా నమోదు కాగా.. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. పెద్ద ల సమక్షంలో రాజీపడ్డారు. ఆ తర్వాత మేడ్చ ల్ జిల్లా బోడుప్పల్ బాలాజీహిల్స్ శ్రీనివాసనగర్‌లో నివాసం ఉంటున్నారు.
పెళ్లయిన తర్వాత మొత్తం నాలుగుసార్లు గొడవపడ్డా రు. అంతేకాకుండా ఇద్దరి కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలకు చెందిన వారి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. దీంతో మహేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులు ఎవరూ సహకరించలేదు. సంవత్సరం క్రితం స్వాతి గర్భం దాల్చగా అబార్షన్ చేయించాడు. ఇటీవలే మళ్లీ గర్భం దాల్చింది. దీంతో ఈ నెల 23న మెడికల్ చెకప్ తర్వాత ఇంటికి వెళ్తా అని స్వాతి అనడంతో గొడవ పడ్డారు.
అదేరోజు సాయంత్రం పథకం ప్రకారం మహేం దర్‌రెడ్డి తన భార్య స్వాతిని కొట్టి బెడ్ మీద పడేశాడు. ఆమె అపస్మాకర స్థితిలోకి వెళ్లిన తర్వాత రంపంతో తల, మొండెం, కాళ్లు, చేతులు వేరు చేశాడు. రాత్రి సమయంలో చిన్న చిన్న కవర్లలో ముక్కలు తీసుకెళ్లి మూసీ నదిలో పడేశాడు. తల ఒకసారి, కాళ్లు ఒకసారి, చేతులు ఒకసారి ఇలా మూ డుసార్లు మూసీ వద్దకు వెళ్లి విసిరేశాడు. ఆ తర్వాత మరదలు చంద్రకళకు ఫోన్ చేసి స్వాతి కనిపించడం లేదని చెప్పాడు.
మేం బాగానే ఉన్నాం.. భోజనం చేశామని శనివారం రాత్రి కూడా స్వాతి ఫోన్ నుంచి ఆమె తల్లికి మెసేజ్ పంపాడు. అయితే చంద్రకళ ఏం జరిగిందో చూడాలని దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటు న్న తన మేనమామ గోవర్ధన్‌రెడ్డికి చెప్పింది. గోవర్ధన్‌రెడ్డి.. బోడుప్పల్‌కు వెళ్లగా అతనికి కూడా తన స్వాతి కనిపించడం లేదని మ హేందర్‌రెడ్డి చెప్పాడు. దీంతో ఇద్దరూ కలిసి శనివారం రాత్రి ఉప్పల్ పోలీ స్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు.
బోడుప్పల్ బాలాజీహిల్స్ మేడిపల్లి పీఎస్ పరిధిలోకి వస్తుందని చెప్పడంతో మేడిపల్లిలో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఈ క్ర మంలోనే పోలీసులు మహేందర్‌రెడ్డిని పలుమార్లు ప్రశ్నించ డంతో స్వాతిని చంపింది తానేని అంగీకరించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టా రు. ఫోరెన్సిక్ నిపుణులు, క్లూస్ టీమ్ సా యంతో ఆధారాలు సేకరించారు. ఆదివారం ఉదయం మహేందర్‌రెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లి చూసేసరికి కేవలం మొండెం మాత్రమే మిగిలింది.
మొండేనికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపు లోనే ఉన్నాడని, కేసుకు సంబంధించిన సాంకేతిక ఆధారాలన్నీ సేకరించిన తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని డీసీపీ తెలిపారు. జీహెఎంసీ, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది మహిళ శరీర భాగాల కోసం మూసీ నదిలో గాలిస్తున్నారు. కాగా వికారాబాద్ మండలం కామారెడ్డిగూడలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.