మాజీ ప్రియురాలి దారుణ హత్య
- ఆఫీసులో 20 సార్లు కత్తితో పొడిచిన ఉన్మాది
- అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం
- పంజాబ్‌లోని మొహాలిలో ఘటన
చండీగఢ్, జూన్ 5: మాజీ ప్రియురాలిని ఓ ఉన్మాది తన కార్యాలయంలో అందరూ చూస్తుండగానే అత్యంత దారుణంగా, 20 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. అదే కత్తితో తనూ పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన పంజాబ్‌లోని మొహాలిలో చోటు చేసుకుంది. ఈ హత్యపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి(ఎస్‌హెచ్‌వో) అమన్ బైద్వాన్ శుక్రవారం మీడియాకు వివరాలను వెల్లడించారు.
పటియాలాకు చెందిన డింపుల్(30) మొహాలిలోని ఫేజ్11లో ఉన్న ఎస్‌ఆర్పీయూఎస్ లాజిస్టిక్స్ సంస్థలో డిస్పాచ్ టీమ్‌లో పనిచేస్తుంది. అదే సంస్థలో సహోద్యోగిగా హర్జిందర్ సింగ్(39)తో మూడేళ్లుగా ప్రేమలో ఉంది. ఇటీవల వీరు విడిపోయారు. దీన్ని తట్టుకోలేని హర్జిందర్ సింగ్ డింపుల్‌తో కలిసి మాట్లాడాలని పలుమార్లు ప్రయత్నించాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో మానసిక వేదనకు గురయ్యాడు. గురువారం సాయంత్రం హర్జిందర్ సింగ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో కార్యాలయంలోకి వెళ్లి, వెనుక నుంచి ఆమె మెడపై కత్తితో దాడి చేశాడు. ఆమె లేచి అరుస్తూ పరుగెత్తింది. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించినా వెంబడించి మరీ 20 సార్లు పొడిచాడు.
తోటి ఉద్యోగులు అతన్ని ఆపేందుకు ప్రయత్నించగా, వారిని కూడా బెదిరించాడు. డింపుల్‌ను పొడిచాక తనను తాను కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారి వివరించారు. ఈ ఘటనతో సంస్థలోని ఉద్యోగులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. పోస్ట్‌మార్టం అనంతరం డింపుల్ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడు హర్జిందర్ సింగ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.






