నీట్‌పై ప్రతిష్ఠంభన
- నాలుగో రోజు స్తంభించిన పార్లమెంట్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ప్రతిపక్షం పట్టు
- చర్చకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టీకరణ
- తేదీ, సమయం మీరే నిర్ణయించండి
- పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు
- రాజకీయం చేయొద్దు, చర్చలో పాల్గొనండి
- బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా
- మంత్రి రాజీనామా తర్వాతే చర్చకు సిద్ధమన్న ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే
- నిరసనలతో ఉభయ సభలు రోజంతా వాయిదా
న్యూఢిల్లీ, జూలై 23 (విజయక్రాంతి) : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నాలుగో రోజు కూడా ప్రతిష్ఠంభన కొనసాగింది. నీట్ ప్రశ్న పత్రం లీక్ వ్యవహారం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌పై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగడంతో గురువారం లోక్‌సభ, రాజ్యసభల్లో ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దిగి నినాదాలు చేయడంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. చివరకు రోజంతా ఎలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు జరగకుండానే ముగిశాయి.
ఏం జరిగింది?
ఉదయం దిలీప్ సైకియా అధ్యక్షతన సభ ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశారు. అయితే, చర్చకు ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పునరుద్ఘాటించారు. మంత్రి రాజీనామా చేసిన తర్వాతే చర్చలో పాల్గొంటామని స్పష్టం చేశారు. ఈ అంశంపై రాజ్యసభలో రూల్--267 కింద చర్చ చేపట్టాలని కూడా ప్రతిపక్షం కోరింది.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపక్షాల వైఖరిని తప్పుబట్టారు. నీట్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చ జరిగే తేదీ, సమయం, వ్యవధిని కూడా ప్రతిపక్షమే నిర్ణయించుకోవచ్చని ప్రకటించారు. అయినప్పటికీ ముందస్తు షరతులు విధిస్తూ చర్చ నుంచి తప్పించుకునేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్.. సభ్యులను శాంతించాలని, చర్చకు అవకాశం కల్పించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది.
దీంతో ఉభయ సభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ప్రశ్నోత్తరాల సమయం, ప్రభుత్వ బిల్లులపై చర్చలు, ఇతర శాసన కార్యక్రమాలు కూడా అంతరాయానికి గురవడంతో రాజ్యసభను 3 గంటల వరకు వాయిదా వేశారు. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా స్పందించారు.
యువతకు సంబంధించిన కీలక అంశాన్ని ప్రతిపక్షం రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందని విమర్శించారు. ప్రతిపక్షం, రాహుల్‌గాంధీ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని బీజేపీ ఎంపీలు మనోజ్ తివారీ, సంబిత్ పాత్ర విమర్శించారు. ‘పార్లమెంటులో నీట్ గురించి చర్చించండి. ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ చెప్పారు’ అని వారు గుర్తు చేశారు.
ఎన్‌డీఏ ఎంపీల ఆందోళన
నీట్ ప్రశ్న పత్రం లీక్ వ్యవహారం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, సీజేపీ కార్యకర్తల ర్యాలీ సందర్భంగా పోలీసులు క్రూరంగా వ్యవహరించిన తీరుపై పార్లమెంట్‌లో చర్చించాలని ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు. నిరసనలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, సమాజ్‌శాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇండి కూటమి నిరసనకు ప్రతిగా ఎన్డీఏ ఎంపీలు కూడా ఆందోళన నిర్వహించారు. ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సమస్యను రాజకీయాలకు వాడుకోవద్దు : జేపీ నడ్డా
నీట్ పేపర్ లీక్ అంశంపై పార్లమెంట్‌లో పూర్తి స్థాయి చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిద్ధంగా ఉందని రాజ్యసభ్యుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అన్ని పార్టీలతో కలిసి విధానపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతిపక్షం రాజకీయ ఆరోపణలు చేయకుండా చర్చలో పాల్గొనాలని కోరారు.
పేపర్ లీక్‌లు ఒకే రాష్ట్రానికి లేదా ఒకే పార్టీకి సంబంధించిన సమస్య కాదని, ఇది దేశవ్యాప్త సమస్య అని వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ చేసిన విమర్శలకు స్పందిస్తూ, సమస్యను రాజకీయంగా ఉపయోగించుకోవడం కంటే పార్లమెంట్‌లో చర్చ జరిపి పరిష్కారం కనుగొనాలన్నారు. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో, ప్రభుత్వం మరింత చర్చలకు కూడా సిద్ధంగా ఉందని, అవసరమైతే తన కార్యాలయంలో గానీ నివాసంలో గానీ సమావేశం కావచ్చని నడ్డా సూచించారు.






