24 July, 2026 | 2:33 AM

బీజేపీకి పారాహుషార్!

24-07-2026 01:28 AM
  1. నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వ తాత్సారం 
  2. సర్కారు నిర్లక్ష్యంపై జెన్‌జీ ఉద్యమం 
  3. దేశవ్యాప్తంగా విస్తరణ? 
  4. వైఫల్యాలపై నైతిక బాధ్యత వహిస్తూ గతంలో పలువురు మంత్రుల రాజీనామా 
  5. ఇప్పటికైనా ప్రధాని మోదీ కఠిన చర్యలకు దిగాలి

* ప్రభుత్వం అలసత్వం కారణంగానే యువత వీధుల్లోకి వచ్చింది. జంతర్‌మంతర్ వద్ద లాఠీఛార్జీ, భాష్పవాయు గోళాల ప్రయోగాలు జరిగాయి. వందలాది మంది గాయాలతో ఆసుపత్రుల్లో చేరారు. ఇలా గాయాలపాలైన యువత..ఇప్పుడు దేశ ప్రజల్లో హీరోలుగా నిలుస్తున్నారు. వారు ఒక్కొక్కరు వందల, వేలాది మందిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. విద్యార్థులు, జెన్‌జీ తరం వైల్డ్‌ఫైర్‌గా మారే అవకాశం ఉంది. ఇది దేశ వ్యాప్తం అయితే.. బీజేపీకి మరింత నష్టం కల్గిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

నీట్ పరీక్షా పత్రం లీకయ్యి ఆవేదనతో 20 మంది విద్యార్థులు మరణించారు. సుమారు 23 లక్షల మంది విద్యార్థులు కలత చెందారు. తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. దీనితో దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఈ పరిణామాలపై స్పందించిన కాంగ్రెస్ ధర్నాలకు దిగింది.  పార్లమెంట్ కార్యకలాపాలు స్థంభించాయి. ఇవన్నీ ప్రస్తుతం దేశంలో అత్యంత తీవ్రమైన అంశాలుగా మారాయి.

సమస్య చినికి చినికి గాలివానలా మారిందా.. గోటితో పోయేదానికి గొడ్డలి వరకు తెచ్చుకున్నారా.. అంటే అవుననే సమాధానమే వినపడుతోంది. తెలిసి తెలిసీ బీజేపీ పప్పులో కాలేసినట్టే కనపడుతోంది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా కఠినంగా వ్యవహరించకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమం తలెత్తే అవకాశమూ ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

విద్యార్థుల్లో ఆవేదన..

నీట్ (యూజీ) పరీక్షను గత మే నెలలో నిర్వహించారు. అప్పుడు పరీక్ష పేపర్ లీక్ అయ్యింది. దేశవ్యాప్తంగా దాదాపు 23 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరైన పరీక్ష అది. ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులు.. పరీక్ష పేపర్ లీక్ కావడంతో ఎంతో మనోవేదనకు, ఆక్రోశానికి, కోపానికి గురయ్యారు. వారిలో ఆవేశం పెల్లుబికింది. సమాజంలోని జెన్ జెడ్ యువత అంతా దీనిపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇదే సమయంలో వారి ఆవేదనను ప్రజల్లోకి తీసుకెళ్ళేలా సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) ఆందోళన పగ్గాలు చేతపట్టింది.

స్పందించాల్సిన అవసరం..

వాస్తవానికి ఇంతటి ప్రాధాన్యత ఉన్న అంశం కావడంతో ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంత వేగంగా, కఠినంగా వ్యవహరించిన సంకేతాలు కనపడలేదు. తీవ్ర సంచలనం సృష్టించిన అంశంపై కఠినంగా వ్యవహరించాల్సిన సమయంలో.. కాస్త ఆచితూచి వ్యవహరించారనే చెప్పవచ్చు. సాధారణంగా అయితే.. వెంటనే ఉన్నతస్థాయి విచారణ చేపట్టి బాధ్యులను అరెస్టు చేయాలి.

ఈ శాఖను చూస్తున్న మంత్రిని తప్పించాలి. పరీక్ష నిర్వహణలో వైఫల్యం చెందిన అధికారులు, సిబ్బందిపై వేటు వేయాలి. నీట్ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్‌టీఏ) అధికారులపైనే వేటు వేయాలి. దర్యాప్తును వేగంగా, పారదర్శకంగా జరిగేలా చూడాలి. ఆ అంశాలనే ప్రజలకు విడమర్చి చెప్పాలి. భాజపా ఈ వ్యవహారాన్ని మరింత తీవ్రంగా, వేగంగా, సమర్థవంతంగా హ్యాండిల్ చేసి ఉండాల్సింది. కానీ ఎందుకనో బీజేపీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది.

ఎవరేం చేస్తారో చూద్దాం అన్న చందంగా అలసత్వంతో ఉంది. వేచి చూసే ధోరణిని ప్రదర్శించింది. అదికాస్తా ఇప్పుడు జెన్‌జీ ఉద్యమానికి ఊపిరిపోసిందనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వక్తం అవుతుండటం గమనార్హం. ఇప్పుడు ఈ వ్యవహారం రోడ్లెక్కింది. లాఠీఛార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగాలు, బారికేడ్ల మధ్య ఇది మరింత పెద్ద సమస్యాత్మకంగా రూపాంతరం చెందాయి. విద్యా శాఖ మంత్రికి ఇందులో ప్రత్యక్ష ప్రమేయం లేదనేది స్పష్టంగా తెలిసినప్పటికీ, ఎవరో ఒకరు నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గత చరిత్ర పాఠాలు 

వాస్తవానికి చరిత్రలో జరిగిన సంఘటనల నుంచి పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోవాలని అందరూ చెబుతుంటారు. కానీ బీజేపీ ప్రభుత్వం గత చరిత్ర నుంచి ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదనేది అర్థమవుతోంది. దేశ వ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేసే ఒక సమస్య తలెత్తినప్పుడు సంబంధిత శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తి నైతిక బాధ్యత వహించి పదవి నుంచి స్వచ్చందంగా తప్పుకోవడం అనేది అందరూ ప్రశంసించేదే. దీనినే మొదటిసారిగా భారతదేశ మాజీ ప్రధాని, అప్పటి రైల్వే శాఖా మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి చేసి చూపించారు. ఆయన బాటలో మరికొందరుకూడా నడిచారు. అలాంటి వాటి నుంచే మనం పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోవాలి.

లాల్ బహదూర్ శాస్త్రి 

దేశ రైల్వే మంత్రిగా సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి తన పదవీ కాలంలో రెండుసార్లు రాజీనామా చేశారు. 1956 ఆగస్టులో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మహబూబ్‌నగర్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఇందులో 112 మంది మరణించారు. దీనితో జరిగిన సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. దీనిని అప్పటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ వెనక్కి తీసుకోమని ఒప్పించారు. అయితే 1956 నవంబర్‌లోనే తమిళనాడులో మరో రైలు ప్రమాదం జరిగింది.

ఈ సంఘటనలో 144 మంది మరణించారు. దీనితో మరోసారి రాజీనామా చేసిన లాల్ బహదూర్ శాస్త్రి తన రాజీనామాను తక్షణం ఆమోదించాలని నెహ్రూను కోరారు. నిజానికి సాంకేతిక లోపం వల్ల జరిగిన రైలు ప్రమాదానికి శాస్త్రి వ్యక్తిగతంగా బాధ్యులు కారని, అది రైల్వే బోర్డు బాధ్యత అని సహచర పార్లమెంట్ సభ్యులు అభిప్రాయపడ్డారు. అయితే శాస్త్రి మాత్రం తన బాధ్యతను విస్మరించకుండా రాజీనామా చేసి, ఆమోదించేలా చూశారు.  

వీపీ సింగ్

1987లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ.. తన ఆర్థిక మంత్రి వీపీ సింగ్‌ను రక్షణ మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. కార్పొరేట్ దిగ్గజాలు, వ్యాపారవేత్తలపై ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐటీ దాడులు నిర్వహించి, చాలా మందిని జైలుకు పంపించడంతోనే.. వీపీ సింగ్‌ను ఆర్థిక మంత్రి బాధ్యతల నుంచి రక్షణ మంత్రిత్వ శాఖకు మార్చారు.

అయితే ఇలా ఫోర్ట్‌ఫోలియో మార్పుకు కొద్ది నెలల ముందే.. వీపీ సింగ్ ‘ఫెయిర్ ఫాక్స్ గ్రూప్’ అనే అమెరికన్ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజన్సీని నియమించేందుకు అనుమతించారు. విదేశీ పన్నులు లేని బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకున్న భారతీయుల గుట్టురట్టు చేయడానికి ఈ ప్రైవేటు డిటెక్టివ్ ఏజన్సీని నియమించారు. 

రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరిం చిన తరువాత.. భారత ప్రభుత్వం చేసుకునే రక్షణ ఒప్పందాల్లో మధ్య వర్తులకు చోటు లేదని, మధ్యవర్తులను నియమిస్తే.. టెండర్ ప్రక్రియ నుంచి సదరు కంపెనీలను అనర్హులుగా ప్రకటిస్తామని రాజీవ్‌గాంధీ చేసిన ప్రకటనను ఉటంకిస్తూ.. జర్మనీకి చెందిన హెచ్‌డీడబ్ల్యూ నుంచి రెండు జలాంతర్గాముల కొనుగోలు ప్రక్రియలో ఒక ఏజంట్ కు కమిషన్ చెల్లించారని జర్మనీలోని భారత రాయబారి నుంచి వచ్చిన రహస్య సమాచారం ఆధారంగా విచారణకు ఆదేశించారు. ఇదే విషయాన్ని సీనియర్ పాత్రికేయుడు ఇందర్ మల్హోత్రా రాయడంతో తీవ్ర సంచలనం అయ్యింది. తదనంతరం వీపీ సింగ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.

టీటీ కృష్ణమాచారి

భారత దేశంలో 1957లో మొదటి ప్రధా న రాజకీయ కుంభకోణం జరిగింది. కలకత్తాకు చెందిన వ్యాపారవేత్త హరిదాస్ ముం ధ్రాకు చెందిన ఆరు కంపెనీల్లోని రూ. 1.24 కోట్ల విలువైన నకిలీ/అనుమానాస్పద షేర్ల ను 1957 జూన్‌లో ప్రభుత్వ రంగానికి చెందిన ఎల్‌ఐసీ (లైప్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) కొనుగోలు చేసినట్టు బయటపడింది. ఎల్‌ఐసీ ప్రారంభమైన వెంటనే చేసిన అతిపెద్ద పెట్టుబడి ఇది. దీనిపై న్యూయార్క్ టై మ్స్‌లో కథనం వచ్చింది. ఈ పెట్టుబడి నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, ఈ నిర్ణ యం తీసుకునే ముందు పెట్టుబడి కమిటీని అసలు సంప్రదించలేదని పత్రికలో పేర్కొన్నారు.

దీనిని తీవ్రంగా పరిగణించిన అప్ప టి ప్రధాని నెహ్రూ.. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎం.సి.చాగ్లా నేతృత్వంలో విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. నెల రోజుల్లో కమిషన్ నివేదిక ఇచ్చింది. బహిరంగంగా జరిగిన ఈ విచారణకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈ కుంభకోణంలో ఆర్థిక మంత్రి టి.టి.కృష్ణమాచారికి ఎలాంటి సంబంధం లేదని, సంబంధం ఉందనేందుకు ఎలాంటి ఆధారాలుకూడా లేవని కమి షన్ తేల్చిచెప్పింది. అయినప్పటికీ నైతిక బాధ్యత వహిస్తూ కృష్ణమాచారి 1958 ఫిబ్రవరి 18న రాజీనామా చేశారు.

వీకే కృష్ణమీనన్

గందరగోళ పరిస్థితులను  ఛేదించి అసలైన సమస్యలను గుర్తించి, పరిష్కారం చూపించడంతో దౌత్యవేత్తగా వీకె కృష్ణమీనన్ దిట్ట. ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధిగా ఆయన చైనా, అమెరికాల మధ్య దౌత్య సంబంధాలకు బాటలు వేశారు. కొరియా యుద్ధాన్ని ముగించడంలో కీలక పాత్ర పోషించారు. సూయజ్ కాలువ జాతీయీకరణ వల్ల తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించ డంలో చురుగ్గా వ్యవహరించారు. రక్షణ మంత్రిగా 1961లో పోర్చుగీసు వలస పాలకుల నుంచి గోవాను భారత్‌లో విలీనం చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.

1962లో ఇండో యుద్ధంలో భారత్ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. కృష్ణమీనన్ అసమర్థతపై, మిలిటరీ సన్నద్ధతలో ఆయన చూపిన అలసత్వంపై పార్లమెంట్ లోపల, బయటకూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీనితో బాధ్యత వహిం చి.. వరుసగా రాజీనామా లేఖలు ప్రధానికి పంపించారు. దీనితో 1962 నవంబర్ 7న ప్రధాని నెహ్రూ ఆయన రాజీనామాను ఆమోదించారు.

కేశవ్ దేవ్ మాలవీయ

వృత్తిరీత్యా కెమికల్ ఇంజనీర్ అయిన మాలవీయ.. బ్రిటిష్ వ్యతిరేక స్వాతంత్ర పోరాటంలో, ముఖ్యంగా క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో రహస్యంగా సమాచారాన్ని చేరేవేసే బ్రాడ్‌కాస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేసి క్రియాశీలకంగా వ్యవహరించారు. స్వాతంత్రానంతరం విదేశీ చమురు బహుళజాతి కంపెనీల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేస్తూ.. భారత దేశపు స్వదేశీ చమురు రంగాన్ని బలోపేతం చేయడంతో మాలవీయ అత్యంత ప్రతిష్టాత్మకమైన పాత్ర పోషించారు.

కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా కేశవ్‌దేవ్ మాలవీయ.. విదేశీ కంపెనీల ఆధిపత్యం లేకుండా.. భారత్‌లో చమురు అన్వేష ణను పెంచడానికి ఎంతో కృషి చేశారు. అయితే ఎన్నికల్లో ఒక కాంగ్రెస్ అభ్యర్థికి సహాయం చేయాలని ఒక ప్రైవేటు సంస్థను ఆయన కోరినట్టు అప్పట్లో వార్తలు వచ్చా యి. ఇందులో చేతులు మారిన సొమ్ము చాలా చిన్నదే.

పైగా ఈ సహాయానికి ప్రతిఫలంగా ఆ సంస్థ ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష ప్ర యోజనం పొందలేదని నెహ్రూ నమ్మారు.. అని సర్వేపల్లి గోపాల్ తన ‘జవహర్‌లాల్ నెహ్రూ.. ఎ బయోగ్రఫీ’ అనే పుస్తకంలో రాశారు. ఈ ఆరోపణలపై అంతర్గత విచారణ చేయాలని నెహ్రూ సుప్రీంకోర్టు న్యాయ మూర్తిని కోరారు. అయితే మాలవీయపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉందని తేలడం తో మాలవీయ రాజీనామా చేశారనికూడా ఆ పుస్తకంలో ఉంది.

జరగాల్సిన నష్టం జరిగింది 

నిజానికి నీట్ వ్యవహారంలో అలసత్వం వహించిన బీజేపీకి జరగాల్సిన నష్టం జరిగింది. ఇప్పటికే ఈ విషయం విద్యార్థుల్లోకి, యువతలోకి వెళ్ళింది. సుప్రీంకోర్టు వరకు విష యం వెళ్ళింది. ప్రభుత్వం అలసత్వం కారణంగానే యువత వీధుల్లోకి వచ్చింది. జంతర్‌మంతర్ వద్ద లాఠీఛార్జీ, భాష్పవాయు గోళాల ప్రయో గాలు జరిగాయి. వందలాది మంది గాయాలతో ఆసుపత్రుల్లో చేరారు.

ఇలా గాయాలపాలైన యువత.. ఇప్పుడు దేశ ప్రజల్లో హీరోలుగా నిలుస్తున్నారు. వారు ఒక్కొక్కరు వం దల, వేలాది మందిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. విద్యార్థులు, జెన్‌జీ తరం వైల్డ్‌ఫైర్‌గా మారే అవకాశం ఉంది. ఇది దేశ వ్యాప్తం అయి తే.. బీజేపీకి మరింత నష్టం కల్గిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

మోదీ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి..

నిజానికి నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిన వెంటనే కేంద్ర ప్రభుత్వం కాస్త కఠినంగా వ్యవహరించి, తక్షణం చర్యలు తీసుకుని ఉంటే ప్రస్తుత జెన్‌జీ ఉద్యమ పరిస్థితి తలెత్తి ఉండేది కాదని విశ్లేషకులు అంటున్నారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ ముందుంటారని.. ఈ అంశంలోనూ మోదీ కఠినమైన నిర్ణయం తీసుకోవాలని వారంటున్నారు. నిజానికి నీట్ లీకేజీ జరిగిన వెంటనే సదరు కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తప్పిస్తే.. నీట్ లీకేజీ అంశం ఇంత రచ్చకు దారితీసేది కాదు.

కనీసం ఇప్పటికైనా భేషజాలకు వెళ్ళకుండా.. ప్రధాని మోదీ కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. మంత్రి ప్రధాన్‌ను తప్పించాలి. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ప్రకటించాలి. భవిష్యత్తులో లీకేజీలు జరక్కుండా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి. నీట్ పరీక్షను పర్యవేక్షిస్తున్న ఎన్‌టీఏ అధికారులను బాధ్యులుగా చేయాలి. పేపర్ లీక్‌లో భాగస్వాములైన ప్రతివారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. అవసరం అయితే విచారణకు ఒక స్వతంత్ర కమిషన్‌నుకూడా వేయాలి.

అలాగే దీనితో ప్రమేయం ఉన్న హెచ్‌ఎండీలు, ఇతర అధికారులపైనా చర్యలు తీసుకోవాలి. పార్లమెంట్‌లో అవనవసర చర్చలతో లేదా విద్యార్థి/ప్రతిపక్ష నాయకులతో సమావేశాలతో సమయాన్ని వృథా చేయకూడదు. ఎటువంటి అహంకారం లేకుండా.. తాము విద్యార్థులవైపే ఉన్నామని ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తెలియజేయాలి. దీనివల్ల తన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే దానికన్నా.. మరింత ఆలస్యం జరిగితే వచ్చే నష్టం భారీగా ఉంటుందని గ్రహించాలి. బీజేపీ ఇకనైనా తన అహంకారాన్ని పక్కనపెట్టాలి. లేకపోతే.. ఈ ఉద్యమం దేశవ్యాప్తం అయ్యే ప్రమాదం ఉంది. అది అంతిమంగా బీజేపీకి నష్టం కల్గిస్తుంది.

సి.ఎల్.రాజం

చైర్మన్, విజయక్రాంతి