సీఎంకు కేటీఆర్ లీగల్ నోటీసులు
- 48 గంటల్లో రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలి
- నా ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యాఖ్యలు
- గ్లోబరీనా టెక్నాలజీస్‌తో నాకు సంబంధం లేదు
- ఆధారాల్లేకుండా తప్పుడు ప్రచారం
- సీబీఐ విచారణకు నేను సిద్ధం.. రేవంత్‌రెడ్డి సిద్ధమా?
- అవసరమైతే లై డిటెక్టర్ టెస్ట్‌కూ సిద్ధమే
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్/మహబూబాబాద్, జూలై 23 (విజయక్రాంతి): గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థ వ్యవహారంలో తనపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన అసత్య ఆరోపణలను ఉపసంహరించుకుని, 48 గంటల్లో భేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రేవంత్‌రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేశారు. గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థతో తనకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు, యాజమాన్య హక్కులు లేదా ఇతర అనుబంధాలు లేవని కేటీఆర్ స్పష్టంచేశారు.
ఎలాంటి ఆధారాలు లేకుండానే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి మీడియా వేదికగా అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. గ్లోబరినా సంస్థ తన బినామీ కంపెనీ అని, ఆ సంస్థకు సీబీఎస్‌ఈ కాంట్రాక్టులు ఇప్పించానని చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తన వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతోనే చేసినవని విమర్శించారు. అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి నిరాధార ఆరోపణలు చేయడం బాధ్యాతారాహిత్యమని మండిపడ్డారు.
రాజకీయ ప్రయోజనాల కోసం తన పరువుకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. ముఖ్యమంత్రి చేసే అసభ్యకరమైన, నిరాధారమైన ఆరోపణలకు తాను చాలా సందర్భాల్లో స్పందించలేదని, అవి అంతగా విలువలేనివని భావించానని పేర్కొన్నారు. తన మౌనాన్ని బలహీనతగా లేదా ఆరోపణలను అంగీకరించినట్లుగా భావించవద్దని స్పష్టం చేశారు. బురద రాజకీయాల్లో దిగడానికి తనకు ఆసక్తి లేదని స్పష్టం చేశారు.
48 గంటల్లోగా భేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పి ఆరోపణలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలతోపాటు పరువు నష్టం దాఖలు చేస్తామని హెచ్చరించారు. గురువారం ఉదయం హన్మకొండలో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. అనంతరం మీడియాతో చిట్‌చాట్‌లో కేటీఆర్ మాట్లాడారు. గ్లోబరినా సంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఆ సంస్థ నిజంగానే తన బినామీ సంస్థ అయితే, అదే సంస్థతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఒప్పందాలు చేసుకుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఒకవైపు ఆ సంస్థతో ఒప్పందాలు చేసుకుని, మరోవైపు అది తన బినామీ సంస్థ అని ఆరోపించడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రస్తావించలేదని విమర్శించారు.
రాజ్‌భవన్ ముందు ధర్నా చేయాల్సింది పోయి కొడంగల్‌లో ధర్నా చేయడం రాజకీయ నాటకమేనని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగలు కాంగ్రెస్‌తో, రాత్రి బీజేపీతో ఉంటారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఒక మూట, బీజేపీకి రెండు మూటలు పంపుతున్నది రేవంత్‌రెడ్డి పాలన అని మండిపడ్డారు. తాను సీఐడీ విచారణకు సిద్ధమని, అలాగే రేవంత్‌రెడ్డి కుటుంబ అవినీతి ఆరోపణలపై సిట్ లేదా సీఐడీ విచారణకు ముఖ్యమంత్రి సిద్ధమేనా అని ప్రశ్నించారు.
అవసరమైతే లై డిటెక్టర్ పరీక్షకు కూడా తాను సిద్ధమేనని, ముఖ్యమంత్రి కూడా అందుకు రావాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి మోదీ పేరును ప్రస్తావించడానికి కూడా భయపడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. పాత కేసుల భయం, అమృత్ పథకం తదితర కాంట్రాక్టుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో రాజీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.






