5 July, 2026 | 9:01 AM

ప్రత్యేక ట్రేడింగ్ పాజిటివ్ ముగింపు

19-05-2024 12:05 AM

పాయింట్ల పైకి సెన్సెక్స్ 

ముంబై, మే 18: స్టాక్ ఎక్సేంజీలు శనివారం ప్రత్యేకంగా నిర్వహించిన ప్రత్యేక ట్రేడింగ్ సెషన్స్‌లో స్టాక్ సూచీలు సానుకూలంగా ముగిసాయి. మార్కెట్ లాభాలతో ముగియడం వరుసగా ఇది మూడవ రోజు. బీఎస్‌ఈ సెన్సెక్స్ 89 పాయింట్లు పెరిగి 74,006 పాయింట్ల వద్ద నిలిచింది. మొత్తం గంటన్నరపాటు ట్రేడింగ్ జరగ్గా, తొలిదశలో సెన్సెక్స్ 246 పాయింట్లు లాభపడి 74,162 పాయింట్ల గరిష్ఠాన్ని సైతం తాకింది. ఇదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 22,502 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాల నేపథ్యంలో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్ పెరగడంతో పాటు డో జోన్స్ ఇండస్ట్రియల్ ఏవరేజ్ సూచి తొలిసారిగా 40,000 పాయింట్లను తాకింది. ఈ పాజిటివ్ సెంటిమెంట్ భారత్ మార్కెట్‌పై పడిందని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సి చెప్పారు. కొద్దివారాల నుంచి నాన్‌స్టాప్‌గా అమ్మకాలు జరుపుతున్న విదేశీ ఇన్వెస్టర్లు శుక్రవారం కొనుగోళ్లు జరపడంతో మార్కెట్‌పై ఒత్తిడి తగ్గిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ చెప్పారు. ఈ వారం మొత్తంమీద సెన్సెక్స్ 1,341 పాయింట్లు పెరగ్గా, నిఫ్టీ 446 పాయింట్లు ర్యాలీ జరిపింది. 

రికార్డుస్థాయికి మార్కెట్ విలువ

ప్రత్యేక ట్రేడింగ్ సెషన్లో మార్కెట్ విలువ రికార్డుస్థాయి రూ.412 లక్షల కోట్లకు  చేరింది. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.4,12,36,791 కోట్ల వద్ద నిలిచింది. సెన్సెక్స్ బాస్కెట్‌లో నెస్లే, పవర్‌గ్రిడ్, టాటా మోటార్స్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, హిందుస్థాన్ యూనీలీవర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు పెరిగాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లు స్వల్పంగా నష్టపోయాయి. 

ట్రేడింగ్ సాగిందిలా..

విపత్కర పరిస్థితుల్లో ట్రేడింగ్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఎక్సేంజ్‌లు ఏర్పాటుచేసిన డిజాస్టర్ సైట్లను పరీక్షించేందుకు ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్ విభాగాల్లో ఈ సెషన్స్ నిర్వహించారు. ట్రేడింగ్ సమయానికి బ్రేక్ ఇచ్చి, రెండు ఎక్సేంజీలు వాటి ప్రైమరీ సైట్ నుంచి డిజాస్టర్ రికవరీ (డీఆర్) సైట్‌కు మార్చాయి. ఉదయం 9.15 నుంచి 10 గంటలవరకూ ప్రైమరీ సైట్‌లో,  డీఆర్ సైట్ ద్వారా 11.15కు ట్రేడింగ్ మొదలై 12.30 గంటలకు ట్రేడింగ్ ముగిసింది.