5 July, 2026 | 7:49 AM

పెట్టుబడికి బంగారమే కాదు.. వెండి కూడా!

19-05-2024 12:05 AM

రూ.లక్షన్నర వరకూ పెరిగే ఛాన్స్   

విశ్లేషకుల సిఫార్సు

వెండి, బంగారం వెలుగులు మార్కెట్లో విరజిమ్ముతున్నాయి. కొద్ది నెలల నుంచి పసిడి అదేపనిగా పెరుగుతూ మదుపుదారులకు భారీ లాభాలనే అందించింది. ఇదే సమయంలో వెండి కింద, మీద పడుతూ ఎట్టకేలకు కొద్ది రోజుల నుంచి పరుగులు తీస్తున్నది. ర్యాలీలో బంగారానికి వెండి తోడైన నేపథ్యంలో మీ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోలో బంగారమే కాదు.. వెండి కూడా ఉండాలని విశ్లేషకులు సిఫార్సు చేస్తున్నారు. త్వరలోనే కేజీ వెండి ధర లక్ష రూపాయిలకు చేరుతుందని, వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఉన్నత శిఖరాల్ని ఈ వైట్ మెటల్ అందుకుంటుందని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోది అంచనా వేస్తున్నారు. యూఎస్ వడ్డీ రేట్లు క్రమేపీ తగ్గుతాయన్న అంచనాలతో అమెరికా డాలర్ ఇండెక్స్ ఐదు వారాల కనిష్ఠస్థాయికి పడిపోయిందని, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ తగ్గాయని, ఇవి రెండు తగ్గడం విలువైన లోహాలకు సానుకూల అంశమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధి చెప్పారు. రాగి, అల్యూమినియం, జింక్, లెడ్ తదితర కీలక పారిశ్రామిక లోహాల ధరలు జోరుగా పెరిగాయని, పరిశ్రమల్లో వినియోగించే వెండి ధర సైతం ఎగిసిందని జియోజిత్ ఫైనాన్షియల్ కమోడిటీస్ హెడ్ హరీశ్ వివరించారు. రికార్డు బంగారం ధరలు, రాజకీయ భౌగోళిక ఉద్రిక్తతలు, యూఎస్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు తదితర అంశాలతో వెండి ర్యాలీ జరుపుతున్నదన్నారు.

ఈవీలు, సోలార్ ప్యానల్స్ డిమాండ్

వెండితో రూపొందేవి అలంకార వస్తువులు, ఆభరణాలే కాదు. పరిశ్రమల్లో బంగారం వినియోగించేది అత్యల్పం. వెండి వాడకం విస్త్రతం. అంతరిక్ష పరికరాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానల్స్ వరకూ వెండిని వాడాల్సిందే. ఎలక్ట్రిక్ వాహన తయారీ ఊపందుకోవడంతో ఈ రంగం నుంచి వెండికి భారీగా డిమాండ్ పెరిగిందని, ఫోటోవాల్టిక్ సోలార్ ప్యానల్స్ తయారీదారులు వెండి కోనుగోళ్లకు ఎగబడుతున్నారని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది చెప్పారు. దీంతో వెండిలో బుల్ ట్రెండ్ ఏర్పడిందని, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూల లోహంగా మారిందని తెలిపారు. అన్ని లోహాల్లోకెల్లా వెండికి ఎలక్ట్రికల్, థర్మల్ కండక్టివిటీ ఎక్కువగా ఉంటుందని, దీంతో లిథియం ఐయాన్ బ్యాటరీలు ఉపయోగించే ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి, సెమికండక్టర్ చిప్స్ ఉత్పత్తికి వెండి అవసరం ఎక్కువ. 

ద్రవ్యోల్బణానికి రక్షణ

ప్రస్తుత స్థూల ఆర్థిక వాతావరణంలో, అధిక విలువతో ఈక్విటీ మార్కెట్లు ఆటుపోట్లకు గురవుతున్న తరుణంలో వెండి తప్పనిసరి పెట్టుబడి సాధనంగా మారిందని జిమిత్ మోది చెపుతున్నారు. వెండిలో పెట్టుబడి ద్రవ్యోల్బణానికి రక్షణగా నిలుస్తుందని, దీనితో పాటు అధిక పారిశ్రామిక వినియోగం, స్టోర్ విలువ కారణంగా దీని ధర భారీగా పతనమయ్యే అవకాశాలు తక్కువని వివరించారు.  మరోవైపు వడ్డీ రేట్లు తగ్గిన ప్రతీ సందర్భంలోనూ వెండి ధర పెరుగుతుందని, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల కోతలు అంచనాలు వెండి ధరను ఎగదోస్తాయని మోది వివరించారు. డాలరు పెరిగితే వెండి తగ్గడం, డాలరు తగ్గితే వెండి పెరగడం కూడా సాధరణమేనని చెప్పారు. 

భారీగా పెరిగిన దిగుమతులు

వెండి వినియోగంలో టాప్ ఐదు దేశాల్లో భారత్ ఒకటి. దేశంలో ఉత్పత్తయ్యే వెండి మన వినియోగానికి సరిపడా ఏటా దిగుమతి చేసుకుంటాం. 2023 ఆర్థిక సంవత్సరంలో దేశంలోకి 1561 మెట్రిక్ టన్నుల వెండి దిగుమతయ్యింది. 2022 జరిగిన 1,173 మెట్రిక్ టన్నుల దిగుమతులతో పోలిస్తే తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరిగాయి. దేశంలో వెండికి పెద్ద ఎత్తున డిమాండ్ పెరుగుతున్న కారణంగా దిగుమతులు జోరందుకుంటున్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

బంగారంకంటే చౌక

పలువురు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుత బంగారం ధరతో పోలిస్తే వెండి చాలా తక్కువగా ఉన్నది. ప్రపంచ మార్కెట్లో 2011లో ఔన్సు వెండి ధర 49.8 డాలర్ల రికార్డుస్థాయికంటే ఇప్పుడు 40 శాతం తక్కువగా (31.5 డాలర్లు)  ఉన్నది. కానీ ఔన్సు బంగారం ధర అప్పటి 1,885 డాలర్లకంటే ప్రస్తుతం 30 శాతం అధికంగా (2,425 డాలర్లు) ట్రేడవుతున్నది. కానీ ఈ మధ్యకాలంలో డాలరు మారకంలో రూపాయి విలువ భారీ పతనం (55 నుంచి 83.5) కారణంగా భారత్‌లో వెండి ఇప్పుడు ఆల్‌టైమ్ రికార్డుస్థాయిలోనే పలుకుతున్నది. రానున్న ఒకటి, రెండేండ్లలో అంతర్జాతీయ మార్కెట్లో వెండి 49 డాలర్ల స్థాయికి చేరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆ స్థాయికి ప్రపంచ మార్కెట్లో ధర పెరిగితే దేశీయంగా వెండి రూ.1.5 లక్షల్ని చేరుతుంది.