ఛత్తీస్‌గఢ్‌లో అమిత్ షా పర్యటన.. బాంబు పేలి జవాన్‌కు గాయాలు
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన దృష్ట్యా పోలీసులు హై అలెర్ట్ అయ్యారు. పేలుడు పదార్థాలతో తిరుగుతున్న 9 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. మావోయిస్టు కమాండర్ హీడ్మా స్వగ్రామం పువర్తిలో అమిత్ షా పర్యటిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో ఆదివారం నక్సలైట్లు అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని తన బృందం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుండగా పేలడంతో సరిహద్దు భద్రతా దళానికి చెందిన ఒక జవాన్ గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
అమిత్ షా పర్యటన దృష్ట్యా చేపట్టిన తనిఖీల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పేలుడు ఉదయం 9.30 గంటలకు పనిదోబిర్ క్యాంపు సమీపంలోని హెతర్కాసా గ్రామ రహదారిపై జరిగింది. అక్కడ భద్రతా సిబ్బంది బృందం ఏరియా డామినేషన్ ఆపరేషన్‌లో ఉందని కాంకేర్ పోలీసు సూపరింటెండెంట్ ఇందిరా కళ్యాణ్ ఎలెసెలా తెలిపారు. పెట్రోలింగ్‌లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీని బీఎస్‌ఎఫ్ బృందం గుర్తించిందని తెలిపారు. ఐఈడీని న్యూట్రలైజ్ చేస్తున్న సమయంలో అది పేలడంతో బీఎస్‌ఎఫ్ జవాన్ బి ఈశ్వర్‌రావు చేతికి, ముఖంపై స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. గాయపడిన జవాన్‌కు ప్రాథమిక చికిత్స అందించామని, తదుపరి వైద్య సహాయం కోసం ఆసుపత్రికి తరలించామని ఎస్పీ తెలిపారు. రాష్ట్రానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం తెల్లవారుజామున 1.30 గంటలకు రాయ్‌పూర్ చేరుకున్నారు. రాయ్‌పూర్, బస్తర్ జిల్లాల్లో జరిగే కార్యక్రమాలకు అమిత్ షా హాజరవుతారు.






