శాకాంబరీ అలంకరణలో శ్రీ రేణుకా మాత.. భక్తుల వెల్లువ
భిక్కనూర్, జూలై 18(విజయ క్రాంతి): ఆషాఢ మాసం సందర్భంగా భిక్కనూర్‌లోని శ్రీ రేణుకా మాత ఆలయంలో శనివారం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు వైభవంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలతో శాకాంబరీ దేవి రూపంలో సుందరంగా అలంకరించి భక్తులకు దివ్య దర్శనం కల్పించారు. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది మునిగల్ల నాగరాజు గౌడ్ కుటుంబ సభ్యులు ప్రతి ఏడాది ఈ శాకాంబరీ అలంకరణను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని, కుటుంబాల్లో సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించారు. శాకాంబరీ అలంకరణతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, రోజంతా భక్తులతో కళకళలాడింది.






