calender_icon.png 13 September, 2024 | 12:09 AM

బుద్ధారం గండినీ టూరిజం హబ్‌గా మార్చుకుందాం

08-08-2024 04:48:57 PM

వనపర్తి: రానున్న కాలంలో గోపాల్ పేట మండలం బుద్ధారం గండి ప్రాంతాన్ని టూరిజం హబ్ గా మార్చుకుందామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘూరెడ్డి తెలిపారు. ఇప్పటికే బుద్ధారం గండిలో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్ ఏర్పాటు కోసం భూ సర్వే పూర్తయిందన్నారు. గురువారం గండి ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం కమిటీ సభ్యులకు సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘూరెడ్డి మాట్లాడుతూ.. గండి ఆంజనేయస్వామి ఆలయం రానున్న కాలంలో టూరిజం హబ్ గా మారబోతుందని అందుకు పర్యాటక శాఖ నుంచి ఇప్పటికే రూ.2 కోట్ల  ప్రతిపాదనలు వచ్చాయి.  త్వరలోనే ఇక్కడ హరిత హోటల్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యేని వేదమంత్రాలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు