calender_icon.png 13 September, 2024 | 12:32 AM

మిగిలిన పనులు పూర్తి చేసి దేవాదాయ శాఖకు అందచేయాలి

08-08-2024 05:01:59 PM

అలంపూర్: ప్రసాద్ స్కీం భవనము గ్రౌండ్ ఫ్లోర్ లో మిగిలి ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి ఈనెల 25న దేవదాయ శాఖకు అందజేయాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ సంబంధిత టూరిజం శాఖ అధికారులను ఆదేశించారు. ఆలంపూర్ పట్టణంలోని జోగులాంబ దేవస్థానంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన ప్రసాద్ స్కీం భవనాన్ని గురువారం జిల్లా కలెక్టర్, టూరిజం శాఖ, పురావస్తు శాఖ, రెవెన్యూ శాఖ మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి చేపట్టిన పనులను పరిశీలించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ బిఎం సంతోష్ మాట్లాడుతూ.. గ్రౌండ్ ఫ్లోర్ లో గల 300 మందికి సరిపడే అన్నదాన సత్రాన్ని, వంటగది,  స్త్రీలు, పురుషులు వేరువేరుగా వినియోగించుకునే  విధంగా నిర్మించిన మరుగుదొడ్ల పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.  త్రాగునీరు, వంటలు చేసేందుకు ఉపయోగించుకునే విధంగా మిషన్ భగీరథ నీరు అందించాలని, అలాగే మరుగుదొడ్లు, ఇతర అవసరాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇతర నీటి అవసరాలకు అనువైన స్థలం పరిశీలిస్తే బోర్ వేసేందుకు నిధులు అందజేయడం జరుగుతుందని, పట్టణంలోని మెయిన్ వాటర్ పైప్ లైన్ నుండి నీరు తీసుకోవద్దని సూచించారు.

భవనంలో అసంపూర్తిగా ఉన్న దుకాణాల సముదాయ పనులను పూర్తి చేసి టెండర్ ప్రక్రియ చేపట్టాలన్నారు.  పుష్కర ఘాట్, దేవస్థానానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు.  పార్కింగ్ స్థలంలో అవసరమైన పనులను చేపట్టి టెండర్ టెండర్ ప్రక్రియ చేపట్టాలన్నారు. దేవాలయ పరిసరాలను శుభ్రపరిచి, వ్యర్థ వస్తువులను తొలగించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించారు.  ఈ సందర్భంగా దేవాలయ పరిసరాలతో పాటు, ప్రసాద్ స్కీం భవనాన్ని, పుష్కర ఘాటు, పార్కింగ్ స్థలాలను కలెక్టర్ విస్తృతంగా పరిశీలించారు. 

పై అంతస్తులలో భక్తుల కోసం నిర్మిస్తున్న రూమ్ ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.  దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసి వెంటనే గ్రౌండ్ ఫ్లోర్ అందజేయాలని, మిగతా పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదర్శించారు. ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ ప్రాజెక్టు ముఖ్య అధికారి అనంతరావు, కేంద్ర పురావస్తు శాఖ అసిస్టెంట్ సూపర్డెంట్ డా. రోహిణి పాండే, తహసీల్దార్ మంజుల, మున్సిపల్ కమిషనర్ సరస్వతి, దేవదాయ శాఖ ఈవో పురేందర్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.