17 March, 2026 | 4:10 PM

ఢిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తాం.. కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్

17-03-2026 01:20 PM

హైదరాబాద్: కాంగ్రెస్ జాతీయ పార్టీ.. ఢిల్లీకి ఎన్ని సార్లయినా వెళ్తామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులను కలుస్తామని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) తేల్చిచెప్పారు. మంగళవారం నాడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ మాదిరిగా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఢిల్లీ వెళ్లలేదని శ్రీధర్ బాబు కేటీఆర్ కు చురకలంటించారు. గవర్నర్ ప్రసంగంపై సలహాలు ఆశించామని తెలిపారు.

ప్రాంతీయ పార్టీగా ఉన్న బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) ఢిల్లీకి ఎన్ని సార్లు చక్కర్లు కొట్టిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎన్నిసార్లు ఢిల్లీకి తిరిగారో లెక్క తీయాలన్నారు. ప్రభుత్వాన్ని ఆషామాషీగా కాదు.. బాధ్యతాయుతంగా నడుపుతున్నామని శ్రీధర్ బాబు(Sridhar Babu) వెల్లడించారు. ప్రభుత్వం నడపడమంటే యజ్ఞమని.. ప్రభుత్వలో లేనప్పుడు భావిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నడపడం యజ్ఞమని ఇప్పటికైనా గుర్తించినందుకు సంతోషమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

కాలుష్యం లేకుండా గ్రీన్ ఫార్మా తీసుకురావాలని చూస్తున్నామని సభలో వివరించారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వాటికి అవసరమైన సౌకర్యాలు వస్తాయన్నారు. రూ. 5.75 లక్షల కోట్లతో ఎంవోయూలు ఎందుకు చేశారని ప్రశ్నిస్తున్నారు.. దేశంలోనే ఎక్కువగా మహారాష్ట్ర నుంచి ఎంవోయూలు జరుగుతాయన్నారు. ఎంవోయూల్లో 30-40 శాతం వాస్తవ రూపం దాలుస్తాయని మహారాష్ట్ర తెలిపిందన్నారు. ఎంవోయూలు, పెట్టుబడుల విషయంలో శ్వేతపత్రం సమర్పిస్తామని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మహిళల సాధికారత విషయంలో హేళనగా మాట్లాడటం సరికాదని, కేటీఆర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణ రైజింగ్ ఖచ్చితంగా రైజింగ్ అవుతోంద్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది తమ విజన్ అన్నారు.