calender_icon.png 12 November, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్యశాకు 123 కోట్ల బడ్జెట్

12-11-2025 12:08:57 AM

మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

మధ్యాహ్న భోజనంలో చేపల ఆహారం అమలయ్యేలా సీఎంతో చర్చిస్తాం

హెచ్‌ఐసీసీలో వరల్డ్ ఆక్వాకల్చర్ ఇండియా కాన్ఫరెన్స్‌లో మత్య్సశాఖ మంత్రి వాకిటి శ్రీహరి 

హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): మత్స్యకారుల అభివృద్ధికి రాష్ర్ట ప్రభుత్వం కృషి చేస్తోందని ఆ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. గత ప్రభుత్వం మత్స్యశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.123 కోట్లు కేటాయించిందని తెలిపారు. త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించి మధ్యాహ్న భోజనం పథకంలో చేపలు ఆహారం అమలయ్యేలా చూస్తామని స్పష్టంచేశారు.

నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో మంగళవారం హెచ్‌ఐసీసీలోని నోవాటెల్‌లో ఏర్పాటు చేసిన వరల్డ్ ఆక్వాకల్చర్ ఇండియా  కాన్ఫరెన్స్‌కు మంత్రి శ్రీహరి హాజరయ్యారు. ఈ కాన్ఫరెన్స్‌లో మత్స్య సంపద, మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో నిర్వీర్యమైన మత్స్య శాఖను పునర్నిర్మాణం చేస్తూ.. తాను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మొదటి క్యాబినెట్‌లోనే మత్స్య శాఖకు దాదాపు రూ.123 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు చెప్పారు.

రూ.1.40 కోట్లతో మత్స్యకారులకు ఇన్సూరెన్స్ కల్పించామని పేర్కొన్నారు. రాష్ట్రం గోదావరి, కృష్ణా నదుల మధ్య ఉండటమే కాకుండా గొలుసు కట్టు చెరువులు ఒక గొప్ప వరమని, ఈ నీటి వనరులు మత్స్య సంపదకు ఎంతగానో దోహద పడుతాయని వివరించారు. రాష్ర్ట ఆర్థిక వ్యవస్థకు మత్స్య శాఖ క్రియాశీలకంగా మారేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో ఉన్న దాదాపు 26 వేల నీటి వనరుల్లో చేప పిల్లల పంపిణీ చేస్తున్నామని, వీటిలో 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేస్తున్నామని వివరించారు.

రిజర్వాయర్లలో అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో, పెద్ద చెరువుల్లో ఆర్డీవో, చిన్న చెరువుల్లో తహసీల్దార్ ఆధ్వర్యంలో చేప పిల్లల పంపిణీ  చేస్తున్నామని, చేప పిల్లల పంపిణీకి సంబధించిన వివరాలను వెల్లడించేందుకు చెరువు వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఫిషరీస్ డైరెక్టర్ నిఖిల, సీఈవో బెహరా, జాయింట్ సెక్రటరీ నీతు కుమారి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఐకార్ జాయ్ కృష్ణ, పీవీఎన్‌ఆర్ వెటర్నరీ వర్సిటీ వీసీ జ్ఞానప్రకాశ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.