24-02-2026 01:15:29 PM
మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్‌లోని లిసాడి గేట్ ప్రాంతంలోని ఒక ఇంట్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో(Meerut house fire) మహిళలు, పిల్లలు సహా ఆరుగురు మృతి చెందినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. "ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. గాయపడిన కుటుంబ సభ్యులను సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆరుగురు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు" అని ఎస్పీ అవినాష్ పాండే ఆసుపత్రిలో విలేకరులకు తెలిపారు.
సోమవారం రాత్రి 8:49 గంటలకు ఇక్బాల్ అహ్మద్ ఇంట్లో మంటలు చెలరేగినట్లు సమాచారం అందిందని, ఆ తర్వాత సహాయక చర్యలు ప్రారంభించామని ఎస్పీ తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నామని, మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించకూడదని కుటుంబ సభ్యులు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారని పోలీసులు తెలిపారు. మృతులను రుఖ్సర్ (25), మహబిష్ (12), హమ్మద్ (4), అక్దాస్ (4), నబియా (4 నెలలు), ఇనాయత్ (4 నెలలు) గా గుర్తించారు. వీరందరూ కిద్వాయ్ నగర్ లోని సురాహి వాలి మసీదు సమీపంలోని గలి నంబర్ 3 నివాసితులు అని పోలీసులు తెలిపారు.