29 May, 2026 | 2:54 AM

20 లక్షల ఇండ్లు కట్టి చూపండి

29-05-2026 01:42 AM
  1. ఇండ్లు నిర్మించిన తరువాతే ఓట్లడగాలి 
  2. చాలెంజ్ చేసిన మంత్రికి మాట నిలబెట్టుకునే దమ్ముందా? 
  3. ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టే చిట్కాలు మాకు తెలియవు
  4. బీసీ నేతలపై పేపర్లు విసిరికొట్టడం కూడా తెలియదు
  5. 420 హామీల మోసాన్ని ఎండకట్టకుండా వదిలిపెట్టబోమని స్పష్టీకరణ 
  6. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి): 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతాం అని ఛాలెంజ్ చేసిన మంత్రికి మాట నిలబెట్టుకునే దమ్ముందా? శపథం చేయడం కాదు.. చేతనైతే చేసి చూపించా లి.. అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. 20 లక్షల గృహ ప్రవేశాలు చేయించాకే.. ఓట్లు అడుతాం అనే సవాల్‌కు కట్టుబడి ఉండాలన్నారు.

హైదరాబాద్ నగరంలో బీఆర్‌ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు నిర్మిస్తామని, లేనట్లయితే వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని  మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీ ఆర్.. ప్రతి సవాల్ చేశారు. సవాళ్లు చేయ డం, పారిపోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటేనని విమర్శించారు.

ఆత్మగౌరవ గృహాలు కట్టిన ఆత్మగౌరవ పార్టీ మాది.. స్వరాష్ట్రాన్ని సాధించాం, పేదల స్వగృహ స్వప్నాలను సాకారం చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. డబ్బా ఇళ్లు కాదు.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించామని ఉద్ఘాటించారు. హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్‌బెడ్ రూం ఇళ్లు నిర్మించిన ఘనత తమదని, రూ.70 వేలతో అగ్గిపెట్టె ఇళ్లు కట్టలేదని, తాము నిర్మించిన ఒక్కో గృహం 7 ఇందిరమ్మ ఇళ్లతో సమానమని స్పష్టం చేశారు.

దేశానికి నమూనాగా అందమైన పొదరిల్లను నిర్మించి చూపించామని, ఇటువంటి సాహసం చరిత్రలో ఎవ్వరూ చేయలేదని, 60 ఏళ్లు ఏలిన పార్టీలకు ఎన్న డూ ఇటువంటి ఆలోచన రాలేదన్నారు. మీకు చిత్తశుద్ధి, సత్తా ఉంటే అంతకు మించి హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించాలని సవాల్ చేశారు.

ఇళ్లు కట్టింది మేం.. కూలగొడుతున్నది మీరు..

గృహనిర్మాణ యజ్ఞం చేసిన నిర్మాతలం తామైతే, గృహమేధ యాగం చేస్తున్న విధ్వంసకులు కాంగ్రెస్ నేతలని కేటీఆర్ మండిప డ్డారు. ఇటుకలు పేర్చి ఇళ్లు కట్టింది తామైతే, పేదల ఇళ్లపై బుల్డోజర్లు ఎక్కించి కూలగొడుతున్న క్రూరులు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీకెండ్‌లో ప్రజల ఇళ్లు కూల్చి వికృతానందం పొందుతున్న మీరు..

పేదల ఇళ్లు కట్టడం గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రెండున్నర ఏళ్లలో హైద రాబాద్ నగరంలో కట్టిన ఇళ్లు ఎన్ని? పడగొట్టిన ఇళ్లు ఎన్ని? దీనిపై శ్వేతపత్రం ప్రకటించే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. దీపావళికి బాంబులు పేలుస్తామని చెప్పి తుస్సు మనిపించిన ‘తుపేల్ మినిస్టర్’, ‘మిస్టర్ బాంబు లేటి’ అంటూ పొంగులేటిపై  వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

ఆత్మాభిమానంతో బతకడమే తెలుసు

తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం, ఆత్మాభిమానంతో బతకడమే తమకు తెలుస ని కేటీఆర్ స్పష్టం చేశారు. మీలాగా కోహినూ రు హోటల్‌లో కాళ్లు పట్టుకొని, ఢిల్లీకి లొంగిపోయి కేసుల నుంచి తప్పించుకునే ఉపాయం తమకు తెలియదన్నారు. అడ్డదారుల్లో కొడుకు కంపెనీకి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇప్పించుకునే కిటుకులు, అక్రమ క్రషర్లు నడుపుతూ ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టే చిట్కా లు తమకు తెలియవన్నారు.

రెవెన్యూ శాఖను అడ్డుపెట్టుకొని భూ భారతిలో బ్లాక్ లిస్టులు, బ్లాక్‌మెయిల్ దందాలు చేసి దండుకోవడం, గూండాలను ఉసిగొల్పి సామాన్యులపై దౌర్జన్యాలు చేసి భూములను బుక్క పట్టడం తమకు తెలియవని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల నేతల మీద అహంకారంతో పేపర్లు విసిరికొట్టడం కూడా తమకు తెలియదని విమర్శించారు.

ప్రభుత్వం ఎన్ని ప్రగల్భా లు పలికినా,  డైవర్షన్ డ్రామాలు ఆడినా 420 హామీల ఎన్నికల మోసాన్ని ఎండగట్టకుండా వదిలిపెట్టబోమని కేటీఆర్ తేల్చి చెప్పారు. ఆరు గ్యారెంటీలు, 13 డిక్లరేషన్ల ఎగవేత ద్రోహాన్ని ప్రశ్నించకుండా విడిచిపెట్టబో మని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.