కృష్ణసాగర్‌లో ఉచిత వైద్య శిబిరం
200 మందికి ఆరోగ్య పరీక్షలు.. ఉచిత మందుల పంపిణీ
బూర్గంపాడు: బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ గ్రామపంచాయతీలో బుధవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి గ్రామస్తులు విశేషంగా స్పందించారు. గ్రామ సర్పంచ్ తాటి వాణి, ఉపసర్పంచ్ భూక్యా మోహన్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు శిబిరం నిర్వహించారు. శిబిరంలో సుమారు 200 మంది ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.
రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాలు, కాలేయం, కంటి సంబంధిత వ్యాధులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు వైద్యులు పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు చేశారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసి వాటి వినియోగంపై అవగాహన కల్పించారు.ఖమ్మం నుంచి వచ్చిన వైద్యులు డాక్టర్ సునీల్ కుమార్ జంగాల, డాక్టర్ స్వాతి జంగాల, డాక్టర్ శ్రావణి, డాక్టర్ రేణుక శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు. గ్రామ ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.






