24 August, 2026 | 11:17 AM

భవనం కూలిన ఘటనలో బిల్డర్‌ సయ్యద్‌ సజీద్‌ అరెస్ట్

24-08-2026 10:46 AM

శేరిలింగంపల్లి, ఆగస్టు 24 (విజయక్రాంతి): అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం కూలిపోయి ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో ప్రధాన నిందితుడైన బిల్డర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సయ్యద్‌ సజీద్‌ అలియాస్‌ సయ్యద్‌ సాజిద్‌ (39)ను ఈ నెల 23న రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ వద్ద రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.శేరిలింగంపల్లి పరిధిలోని అంజయ్యనగర్‌ సర్వే నం.135లోని ప్లాట్‌ నం.113/131/1లో నిర్మాణంలో ఉన్న జీ+6 భవనం ఇటీవల ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాద సమయంలో అదే భవనంలో టైల్స్‌ పనులు చేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ఉమేష్‌ కారే (45), మొహ్‌పాల్‌ భలావి (46) శిథిలాల కింద చిక్కుకుని మృతి చెందారు. భవనం కూలిన ప్రభావంతో సమీపంలోని కొండాపూర్‌ వైట్‌ఫీల్డ్స్‌లోని జయదర్శిని రెసిడెన్సీ సీ-బ్లాక్‌కు నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో కే.వీ. రమణారెడ్డి (75)తో పాటు మరికొందరు గాయపడ్డారు.

జయదర్శిని రెసిడెన్సీకి చెందిన తక్కల వెంకట్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు క్రైమ్‌ నంబర్‌ 945/2026 కింద బీఎన్‌ఎస్‌లోని 105 ఆర్/డబ్ల్యూ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ టి. భూపతి దర్యాప్తు చేపట్టారు.పోలీసుల దర్యాప్తులో భవనాన్ని బిల్డర్‌ సయ్యద్‌ సజీద్‌, కాంట్రాక్టర్‌ ఖాజా మొయినుద్దీన్‌ ద్వారా నిర్మిస్తున్నట్లు గుర్తించారు. అవసరమైన మున్సిపల్‌ అనుమతులు పొందకుండానే నిర్మాణం చేపట్టినట్లు, నిబంధనల ప్రకారం సెట్‌బ్యాక్‌లు పాటించలేదని తేలింది. పక్కనే ఉన్న నాలాను ఆక్రమించడం, నాసిరకం నిర్మాణ సామగ్రిని ఉపయోగించడం వంటి ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి.

భవనం కూలిన ఘటన అనంతరం పోలీసుల దర్యాప్తు వేగవంతం కావడంతో ప్రధాన నిందితుడు సయ్యద్‌ సజీద్‌ దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నించినట్లు గుర్తించి శంషాబాద్‌ వద్ద అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు ఖాజా మొయినుద్దీన్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతడి ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మృతులు ఉమేష్‌ కారే, మొహ్‌పాల్‌ భలావిలకు ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌లో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనకు సంబంధించి మరిన్ని అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని రాయదుర్గం పోలీసులు తెలిపారు.