19 July, 2026 | 3:28 AM

రైతుల్లో బుల్లెట్ దడ

19-07-2026 01:05 AM
  1. రంగారెడ్డి జిల్లాలో హైస్పీడ్ రైలు మార్కింగ్ కలకలం
  2. చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ నియోజకవర్గ రైతుల్లో గుబులు 
  3. ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదు
  4. న్యాయమైన భూ పరిహారం ఇవ్వాలి: రైతులు

రంగారెడ్డి, జూలై 18 (విజయక్రాంతి): మహా నగరానికి మణిహారం లాంటి బుల్లెట్ ట్రైన్ (హైస్పీడ్ రైల్) ప్రాజెక్టు పనులు రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు మూడు బుల్లెట్ రైలు కారిడార్లను నిర్మించేందుకు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్  కసరత్తు మొదలుపెట్టింది.

ఇందులో భాగంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా ప్రముఖ సంస్థ ‘రైట్స్ లిమిటెడ్’ ఆధ్వర్యంలో ఏరియల్, క్షేత్రస్థాయి సర్వేలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, కనీస ముందస్తు సమాచారం లేకుండా రాత్రికి రాత్రే అధికారులు గ్రామాల్లో, విలువైన వ్యవసాయ పొలాల్లో మార్కింగ్‌లు వేస్తుండటంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఫ్యూచర్ సిటీ మీదుగా..

చెన్నై, బెంగళూరు వెళ్లే కారిడార్ కోసం యాచారం మండల పరిధిలోని కుర్మిద్ద, నక్కర్త మేడిపల్లి, నంది వనపర్తి, నానక్నగర్, మల్కీజ్గూడ, తక్కళ్లపల్లి తండా, చింతపట్ల, తమ్మలోనిగూడ, నల్లవెల్లి, మాల్, మంతన్గౌరెల్లి, కేసీ తండా వంటి గ్రామాల్లోని వ్యవసాయ భూము ల్లో మార్కింగ్లు, భూసార పరీక్షలు (బోరెహోల్స్ ) జరుపుతున్నారు. నల్లవెల్లి గ్రామం మధ్యలో ఉన్న ఓం యూత్ ఆఫీస్, తక్కళ్లపల్లి తండాలోని బంగారు మైసమ్మ దేవాలయం పక్కనే ఇంజనీర్ల బృందం గుర్తులు వేసి వెళ్ళడం స్థానికంగా కలకలం రేపింది.

ఆందోళనలో స్థానికులు

కేబీ దొడ్డి గ్రామం, తక్కళ్లపల్లి తండా వంటి ప్రాంతాల్లో ఇళ్ల మధ్యలో, చివరకు గ్రామ దేవాలయాల పక్కనే గుర్తులు వేయడంతో తమ నివాసాలు ఎక్కడ కూలిపోతాయోనని ప్రజలు భయపడుతున్నారు. బుల్లెట్ రైలు కారిడార్ కోసం సుమారు 300 అడుగుల వెడల్పుతో భూసేకరణ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులు తమకున్న కొద్దిపాటి జీవనాధారాన్ని కోల్పోతామని ఆవేదన చెందుతున్నారు.

ఇతర ప్రాజెక్టుల భారం

యాచారం, పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఫార్మా సిటీ, పారిశ్రామిక పార్కుల కోసమని వేలాది ఎకరాల అసైన్డ్, పట్టా భూములను ప్రభుత్వం సేకరిస్తోంది. ఇప్పుడు మళ్లీ బుల్లెట్ రైలు మార్గం అంటూ వస్తుండటంతో ‘తమ భూములు అప్పనంగా లాక్కుంటారా’ అని రైతులు కలవరానికి గురవుతున్నారు.

రైతుల డిమాండ్లు

ప్రస్తుతం ప్రాజెక్టు ప్రాథమిక సర్వే దశలోనే ఉన్నందున ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి భూసేకరణ నోటిఫికేషన్ లేదా నిర్దిష్ట పరిహార ప్యాకేజీని ఇంకా ప్రకటించలేదు. అయితే, శంషాబాద్, మొయినాబాద్, యాచారం ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కారణంగా భూముల విలువ లు కోట్లలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాధిత రైతులు తమ డిమాండ్లను తెరపైకి తెస్తున్నారు.

ప్రభుత్వ నిర్దేశిత విలువ కాకుండా, ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువకు (ఓపెన్ మార్కెట్ వాల్యూ) కనీసం 3 నుంచి 4 రెట్లు అదనంగా నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇళ్లు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయ నివాస స్థలాలతో పాటు, పూర్తి నిర్మాణ ఖర్చులు ప్రభుత్వమే భరించాలి. సాగుభూమి కోల్పోయే చిన్న రైతులకు జీవనోపాధి కోసం ప్రభుత్వమే వేరేచోట అంతే సమానమైన భూమిని కేటాయించాలని కోరుతున్నారు.

రాత్రికి రాత్రే మార్కింగ్

శంషాబాద్ ఎయిర్‌పోర్టు పక్కనే ఉన్న బహదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం 600 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇక్కడి నుంచి వికారాబాద్ మీదుగా ముంబై వెళ్లే కారిడార్ కోసం శంషాబాద్ మండలంలోని చౌదరిగూడ, సుల్తాన్ పల్లి, కేబీ దొడ్డి గ్రామాల్లోనూ, మొయినాబాద్ మండలంలోని అమ్లాపూర్, సురంగల్, కనకమామిడి, తోలుకట్ట ప్రాంతాల్లో అధికారులు గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లను (జీసీపీ ) మార్కింగ్ చేశారు.