23 June, 2026 | 5:48 AM

బుల్స్ జోరు.. రికార్డుల హోరు

13-06-2024 04:31 AM
  • చరిత్రాత్మక గరిష్ఠానికి నిఫ్టీ
  • అంతర్జాతీయ సానుకూల సంకేతాల మద్దతు
  • పవర్, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్ స్టాక్స్‌లో భారీ కొనుగోళ్లు

న్యూఢిల్లీ, జూన్ 12: అంతర్జాతీయ సానుకూల సంకేతాల నేపథ్యంలో బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లో కొత్త రికార్డులు నెలకొన్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ నూతన గరిష్ఠస్థాయికి చేరగా, మార్కెట్ విలువ కొత్త రికార్డుస్థాయిని అందుకుంది. పవర్, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్ స్టాక్స్‌లో భారీ కొనుగోళ్లు జరిగాయి.అంతేకాకుండా ఇండెక్స్ హెవీవెయిట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లు పెరగడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మెరుగుపడిందని ట్రేడర్లు తెలిపారు. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 594 పాయింట్లు ఎగిసి  77,050 పాయిం ట్ల గరిష్ఠస్థాయికి చేరింది. గత సోమవారం ఈ సూచి నమోదు చేసిన ఆల్‌టైమ్ గరిష్ఠం 77,079 పాయింట్లకు కొద్ది దూరం ఉండగా, వెనుతిరిగి చివరకు 150 పాయిం ట్ల లాభంతో 76,607 పాయింట్ల వద్ద ముగిసింది.

కానీ మరో ప్రధాన సూచి చరిత్రాత్మక రికార్డుస్థాయిని తాకింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 177 పాయింట్లు ర్యాలీ జరిపి 23,442 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పింది.  చివరకు 58 పాయింట్ల లాభం తో 23,323 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఈ స్థాయిలో నిఫ్టీ ముగియడం ఇదే ప్రధమం. ఆసియా మార్కెట్లలో సియోల్, షాంఘైలు పెరగ్గా, టోక్యో, హాంకాంగ్‌లు తగ్గాయి. యూరప్‌లో ప్రధాన మార్కెట్లయిన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్‌లు లాభాలతో ముగిసాయి. కడపటి సమాచారం అందేసరికి యూఎస్ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. యూఎస్ ద్రవ్యోల్బణం మే నెలలో 3.3 శాతానికి తగ్గిందన్న వార్తలతో అక్కడ పాజిటివ్ ట్రెండ్ నెలకొన్నది. అయితే కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ అర్థరాత్రిదాటిన తర్వాత వెలువరించే సంకేతాలు మార్కెట్లకు కీలకమని ట్రేడర్లు తెలిపారు. 

బడ్జెట్‌పై దృష్టి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి లోక్‌సభలో వచ్చే నెలలో సమర్పించబోయే పూర్తిస్థాయి బడ్జెట్‌పై ఇన్వెస్టర్లు దృష్టి నిలిపారని, బడ్జెట్లో వృద్ధికి ఊతమిచ్చే చర్యలు ఉంటాయని అంచనా వేస్తున్నందున నిఫ్టీ కొత్త రికార్డుస్థాయికి చేరినట్టు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఇప్పటికే రిజర్వ్‌బ్యాంక్ జీడీపీ వృద్ధి అంచనాల్ని పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఫెడ్ మీటింగ్ నేతృత్వంలో గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడ్‌కావడం దేశీయ ట్రెండ్‌కు కలిసి వచ్చిందన్నారు. యూఎస్ ఫెడ్ సంకేతాలు గురువారం నాటి ట్రేడింగ్‌పై ప్రభావం చూపిస్తుందని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా చెప్పారు. 

రూ.429.32 లక్షల కోట్లకు మార్కెట్ విలువ

బుధవారంనాటి ర్యాలీతో దేశీయ స్టాక్ మార్కెట్ విలువ కొత్త రికార్డుస్థాయికి చేరింది. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.4,29,32,991 కోట్లకు (5.14 ట్రిలియన్ డాలర్లు) పెరిగింది.